కలం, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల తహశీల్దార్ కార్యాలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం (Chevella Fire Accident) చోటుచేసుకుంది. కార్యాలయం పక్కనే ఉన్న పాత పట్వారీ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రస్తుతం ఈ భవనాన్ని రెవెన్యూ శాఖ పాత రికార్డుల స్టోరేజ్ గదిగా ఉపయోగిస్తున్నట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో ఈ స్టోరేజ్ గదిలో భద్రపరిచిన దశాబ్దాల నాటి పాత రెవెన్యూ రికార్డులు, కీలక భూపత్రాలు, ఇతర వస్తువులు అగ్నికీలలకు పూర్తిగా ఆహూతయ్యాయి. భవనం నుండి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటాన్ని గమనించిన స్థానికులు వెంటనే సమాచారం అందించారు. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తర్వితగతిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ ప్రమాదంపై చేవెళ్ల ఎమ్మార్వో కృష్ణయ్య స్పందిస్తూ.. దీపావళి టపాసుల నిప్పురవ్వలు పడటం వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా వివరణ ఇచ్చారు.

