కలం, వెబ్ డెస్క్: మరణానంతరం స్వర్గానికి వెళ్లాలనుంది.. కానీ శతృవులను క్షమించలేనంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. CBS న్యూస్‌కు చెందిన ’60 మినిట్స్’ కార్యక్రమానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ తన మరణంపై మాట్లాడారు. మరణానంతరం స్వర్గానికి వెళ్లాలని కోరుకుంటున్నానని చెప్పిన ఆయన.. అందుకోసం తన రాజకీయ ప్రత్యర్థులను క్షమించాల్సి వస్తే మాత్రం అది తన వల్ల కాదని ట్రంప్ స్పష్టం చేశారు. తాను మత విశ్వాసాలు కలిగిన వ్యక్తినని, సిద్ధాంతపరంగా స్వర్గానికి వెళ్తానని ఆశిస్తున్నానని.. నరకానికి వెళ్లాలని మాత్రం కోరుకోవడం లేదని తెలిపారు.
స్వర్గానికి వెళ్లేందుకు మాజీ FBI డైరెక్టర్ జేమ్స్ కోమీ, మాజీ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ వంటి రాజకీయ ప్రత్యర్థులను క్షమించలేనన్నారు. వారిని అత్యంత నిజాయితీ లేని వ్యక్తులుగా, దేశానికి హాని చేసిన వారిగా ట్రంప్ (Donald Trump) అభివర్ణించారు. అంతేకాకుండా, వారిలో కొందరిపై తనకు ద్వేషం ఉందన్నారు. మరోవైపు, ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు ఫ్రాంక్లిన్ గ్రాహం ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించారు. స్వర్గానికి వెళ్లేందుకు పాపాలను అంగీకరించడం, పశ్చాత్తాపం చెందడం, యేసుక్రీస్తుపై విశ్వాసం కలిగి ఉండటం ముఖ్యమని స్పష్టం చేశారు. స్వర్గానికి వెళ్లాలనే తన ఆకాంక్షను వ్యక్తం చేస్తూనే రాజకీయ ప్రత్యర్థులను క్షమించలేనని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

