కలం, వెబ్ డెస్క్ : విజయనగరం జిల్లా రాజాం (Rajam Fire) పట్టణంలోని పాలకొండ ప్రధాన రహదారిపై ఉన్న నవదుర్గ ఆటోమొబైల్ షాపులో సోమవారం ప్రమాదవశాత్తు భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షాపు నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలతో పాటు పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంపై ఫైర్ సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు.
దీంతో ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, అప్పటికే షాపులోని విలువైన ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్, ఇతర సామగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు 25 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించిందని షాపు యజమాని శివకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

