నేటి నుంచి బస్సుల డోర్లు బంద్‌.. కఠిన నిబంధనలు అమలు!

​కలం, ఖమ్మం బ్యూరో: ​”నిత్యం వేలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే మా ప్రాణాలకు రక్షణ లేదా?.. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులు చేస్తూ పొట్టనబెట్టుకోవడం ఎంతవరకు సమంజసం?” అంటూ కార్మిక లోకం గళమెత్తిన వేళ, టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) యాజమాన్యం ఎట్టకేలకు కళ్లు తెరిచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక (Conductor Pravallika) దుర్మరణం ఉమ్మడి ఖమ్మం రీజియన్‌లోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. టికెట్ విషయంలో ప్రయాణికురాలు జరిపిన అనాగరిక దాడికి ఓ నిండు ప్రాణం బలికావడంతో కార్మిక లోకం భగ్గుమంది. ఈ నేపథ్యంలోనే ప్రయాణికుల భద్రతను మరింత కఠినతరం చేస్తూ టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా కీలక దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టి, నేటి నుంచి కఠిన నిబంధనలను అమల్లోకి తెస్తోంది.

​కంటతడి పెట్టిస్తున్న ప్రవళిక మృతి విషయానికి వస్తే.. గత నెల 25న మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న టీజీఎస్‌ఆర్టీసీ (TGSRTC) బస్సులో ప్రయాణికురాలు బానోతు మౌనికకు, కండక్టర్ ప్రవళికకు మధ్య చిల్లర విషయంలో చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్షణికావేశంలో అశ్వాపురం మండలం మిట్టగూడెం సెంటర్ వద్ద ప్రయాణికురాలు మౌనిక.. కండక్టర్ ప్రవళికను కదులుతున్న బస్సులో నుంచి కిందకు తోసేసింది. ఈ ప్రమాదంలో కింద పడిన ప్రవళిక కాళ్లపై నుంచి బస్సు వెనుక చక్రాలు వెళ్లడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. భద్రాచలం ఆసుపత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని సాయి సంజీవని ఆసుపత్రికి తరలించినప్పటికీ, పది రోజులు మృత్యువుతో పోరాడిన ప్రవళిక మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

​తండ్రి మరణంతో కేవలం ఆరు నెలల క్రితమే కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిన ప్రవళిక, అనతికాలంలోనే ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ దారుణ ఘటనకు నిరసనగా ఖమ్మం రీజియన్ జేఏసీ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా డిపోల ఎదుట కార్మికులు బైఠాయించి ఆందోళనలు చేపట్టారు. ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా, తల్లికి ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు ప్రకటించినప్పటికీ, కోల్పోయిన ప్రాణం తిరిగిరాదనే వేదన కార్మికుల్లో వ్యక్తమవుతోంది.

​ఈ దుర్ఘటనతో తీవ్ర ఆందోళనకు గురైన టీజీఎస్‌ఆర్టీసీ (TGSRTC) యాజమాన్యం, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కఠిన మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల డిప్యూటీ రీజనల్ మేనేజర్లకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. బస్సుల తలుపులు సక్రమంగా పని చేసేలా చూడాలని, డోర్లు పూర్తిగా మూసిన తర్వాతే బస్సులను ముందుకు నడపాలని డ్రైవర్లను ఆదేశించారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీతో పాటు రాజధాని, లహరి స్లీపర్ కోచ్ బస్సులన్నింటిలోనూ ప్రయాణికుల డోర్లు విధిగా మూసి ఉంచాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్(వీటికి డోర్లు ఉండవు) మరియు కొన్ని మెట్రో డీలక్స్ బస్సులకు మాత్రం రద్దీ దృష్ట్యా ఈ నిబంధన నుంచి మినహాయింపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9,900 బస్సుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు, ఈ భద్రతా నిబంధనలు శనివారం నుంచి కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

​ఒకచోటి నుంచి మరోచోటికి సురక్షితంగా చేరాల్సిన ప్రయాణం నేడు నిత్యం చిన్నపాటి వివాదాలకు వేదికవుతోంది. టికెట్ తీసుకునే క్రమంలో చిల్లర గొడవలు, గమ్యస్థానానికి త్వరగా చేరాలనే ఆత్రుత, రోజువారీ ఒత్తిళ్ల మధ్య ప్రయాణికుల్లో సహనం సన్నగిల్లుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోనే ఇటీవల ఖమ్మం బస్టాండ్‌లో కండక్టర్‌పై దాడి జరిగింది, వైరా మార్గంలో కండక్టర్ ను దుర్భాషలాడటం, వీఎం బంజార్‌లో డ్రైవర్‌పై పిడిగుద్దులు కురిపించడం వంటి వరుస ఘటనలు ఆందోళన కలిగించాయి. ప్రవళిక బలిదానం ప్రజా రవాణా వ్యవస్థకు, సమాజానికి ఒక పెద్ద కనువిప్పు కావాలి. చట్టాలు, నిబంధనలు ఎంత కఠినంగా మారినా.. తోటి మనుషుల ప్రాణాలను గౌరవించే పౌర స్పృహ, సంయమనం ప్రతి ప్రయాణికుడిలో ఉంటేనే ఇలాంటి విషాదాలకు శాశ్వత బ్రేక్ పడుతుంది.

Also Read : కొడంగల్ అభివృద్ధి నా కల: సీఎం రేవంత్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>