కలం, ఆదిలాబాద్: ఆదిలాబాద్ రిమ్స్ (Adilabad RIMS) ఆసుపత్రిలో కలకలం రేపిన వెంటిలేటర్ల చోరీ కేసును జిల్లా పోలీసులు ఛేదించారు. సుమారు రూ.32 లక్షల విలువైన నాలుగు వెంటిలేటర్ల చోరీకి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠా గుట్టును రట్టు చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం తెలిపారు. మహారాష్ట్రలోని చంద్రపూర్‌కు చెందిన సజ్జన్, అభిజిత్ అనే ఇద్దరు వ్యక్తులు టెక్నీషియన్లమంటూ రిమ్స్‌లోకి ప్రవేశించి వెంటిలేటర్లను అపహరించినట్లు తెలిపారు. గత నెల 30న రిమ్స్ ఆస్పత్రిలోని రెండో అంతస్తులో ఉన్న ఆర్ఐసీయూ, చెస్ట్ వార్డుల నుంచి ఒక్కో వెంటిలేటర్, టీబీ వార్డు నుంచి మరో రెండు వెంటిలేటర్లు చోరీకి గురయ్యాయి. మొత్తం నాలుగు పరికరాలు మాయమైనట్లు ఆస్పత్రి అధికారులు గుర్తించారు. ఇద్దరు వ్యక్తులు వెంటిలేటర్లను సంచుల్లో పెట్టుకుని తీసుకెళ్తున్న దృశ్యాలు ఆస్పత్రిలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో రిమ్స్ డైరెక్టర్ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే నిందితులను పట్టుకున్నారు.
వెంటిలేటర్లను చోరీ చేసిన సజ్జన్, అభిజిత్ వాటిని హైదరాబాద్‌కు చెందిన కొండారెడ్డి అనే వైద్య పరికరాల వ్యాపారికి విక్రయించినట్లు ఎస్పీ వెల్లడించారు. చోరీ చేసిన పరికరాలను కొండారెడ్డి చంద్రపూర్‌లో కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా ఆదిలాబాద్ పోలీసులు గుర్తించి పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి నాలుగు వెంటిలేటర్లతో పాటు కారు, లక్ష నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. రిమ్స్‌తో పాటు మహారాష్ట్ర, నిజామాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఇదే తరహా చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. రోగుల ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగించే వైద్య పరికరాలను చోరీ చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమైన చర్యని ఎస్పీ పేర్కొన్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేరాల నియంత్రణలో సీసీటీవీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకుని భద్రతను పెంపొందించుకోవాలని సూచించారు.

