భారత ఫుట్‌బాల్‌ ఆంక్షలతో మారదు: కోస్ టోమాజ్

క‌లం, స్పోర్ట్స్: భారత ఫుట్‌బాల్‌ అభివృద్ధికి విదేశీ ఆటగాళ్లపై ఆంక్షలు విధించడం పరిష్కారం కాదని ఎస్సీ ఢిల్లీ కోచ్‌ టోమాజ్‌ టోర్జ్‌ (Tomaz Torgers) అభిప్రాయపడ్డారు. దేశీయ ఆటగాళ్లకు నాణ్యమైన శిక్షణ, ఎక్కువ మ్యాచ్‌లు, తగిన అవకాశాలు కల్పించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆటగాళ్లను వారి జాతీయత ఆధారంగా కాకుండా ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌)లో ఒక జట్టు ఆరుగురు విదేశీ ఆటగాళ్లను రిజిస్టర్‌ చేసుకోవచ్చు. అయితే మైదానంలో ఒకేసారి నలుగురికే అవకాశం ఉంటుంది. ఐ-లీగ్‌లో ఈ పరిమితి ముగ్గురు విదేశీ ఆటగాళ్లుగా ఉంది. ఇలాంటి ఆంక్షలు విధించడం వల్ల భారత ఆటగాళ్ల స్థాయి పెరగదని టోర్జ్‌ పేర్కొన్నారు. వ్యవస్థలోని లోపాలను సరిచేయకుండా ఆంక్షలు విధించడం వల్ల ఆశించిన ఫలితం ఉండదన్నారు.

యువ ఆటగాళ్లకు మ్యాచ్‌లు కరవు

భారత యువ ఫుట్‌బాల్‌ ఆటగాళ్లకు పోటీ మ్యాచ్‌లు తక్కువగా ఉండటం ప్రధాన సమస్యగా మారిందని కోచ్‌ వివరించారు. భారత అండర్‌-15 ఆటగాళ్లు ఏడాదికి కేవలం 12 నుంచి 15 పోటీ మ్యాచ్‌లే ఆడుతున్నారని తెలిపారు. అదే జపాన్‌, దక్షిణ కొరియా ఆటగాళ్లు 40కిపైగా మ్యాచ్‌ల్లో పాల్గొంటున్నారని చెప్పారు. ఈ వ్యత్యాసం ఆటగాళ్ల ఎదుగుదలపై ప్రభావం చూపుతోందన్నారు.

క్లబ్బులు తక్షణ విజయాలు, ఫలితాలకే ప్రాధాన్యం ఇవ్వకుండా యువ ఆటగాళ్ల అభివృద్ధిపైనా దృష్టి పెట్టాలని టోర్జ్‌ సూచించారు. చిన్న వయసులోనే ఆటగాళ్లకు తప్పులు చేసే అవకాశం ఇవ్వాలని, వాటి నుంచి నేర్చుకునేలా ప్రోత్సహించాలని అన్నారు. వీడియో విశ్లేషణ వంటి పద్ధతులతో ఆటగాళ్ల సామర్థ్యాన్ని మెరుగుపరచవచ్చని వివరించారు.

పునాది నుంచే మార్పులు

యువ ప్రతిభను గుర్తించడం మాత్రమే సరిపోదని, వారికి నిరంతర శిక్షణ, పోటీ మ్యాచ్‌లు, సీనియర్‌ జట్లలో ఆడే అవకాశాలు కల్పించాలని టోర్జ్‌ అభిప్రాయపడ్డారు. భారత ఫుట్‌బాల్‌ భవిష్యత్తు బాగుండాలంటే గ్రాస్‌రూట్‌ స్థాయి నుంచి పెట్టుబడులు పెంచాలని సూచించారు. విదేశీ ఆటగాళ్లపై ఆంక్షల కంటే దేశీయ ఆటగాళ్లను మెరుగైన ఫుట్‌బాల్‌ వ్యవస్థలో తీర్చిదిద్దడమే ముఖ్యమని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>