కలం, స్పోర్ట్స్: స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కారజ్ (Carlos Alcaraz) ప్యారిస్ మాస్టర్స్‌లో మరో అద్భుత విజయాన్ని అందుకున్నారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో రెండు మ్యాచ్ పాయింట్లను కాపాడుకున్న అల్కారజ్, అమెరికా ఆటగాడు టేలర్ ఫ్రిట్జ్‌పై పోరాడి గెలిచారు. ఈ విజయంతో ఆయన తొలిసారి ప్యారిస్ మాస్టర్స్ సెమీఫైనల్‌లోకి ప్రవేశించారు. తొలి సెట్‌లో హోరాహోరీ పోరు సాగగా, టైబ్రేకర్ వద్ద ఫోర్‌హ్యాండ్ షాట్‌ను బయటకు కొట్టి అల్కారజ్ ఆ సెట్‌ను కోల్పోయారు. రెండో సెట్‌లో ఫ్రిట్జ్ ఆధిక్యం సాధించి విజయానికి చేరువయ్యారు. అయితే 5-3, 5-4 స్కోర్ల వద్ద లభించిన రెండు మ్యాచ్ పాయింట్లను అల్కారజ్ అద్భుతమైన పాసింగ్ షాట్లతో కాపాడుకున్నారు.
ఆ తర్వాత పుంజుకున్న 23 ఏళ్ల అల్కారజ్ 6-7 (10/12), 7-5, 6-3 తేడాతో ఫ్రిట్జ్‌పై విజయం సాధించారు. మ్యాచ్ ముగిసిన అనంతరం మాట్లాడిన అల్కారజ్, ఈ మ్యాచ్ తన కెరీర్‌లోనే ఎంతో ప్రత్యేకం అని, చాలా కాలం గుర్తుండిపోతుందని తెలిపారు. మానసికంగా బలంగా ఉంటూ ప్రజల నుంచి లభించిన శక్తితో తిరిగి పుంజుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఓటమితో ఫ్రిట్జ్ ఏటీపీ ఫైనల్స్ రేసు నుంచి నిష్క్రమించగా, సెమీస్‌లో కాస్పర్ రూడ్‌తో అల్కారజ్ తలపడనున్నారు. మరో మ్యాచ్‌లో పోర్చుగీస్ ఆటగాడు నూనో బోర్జెస్‌ను ఓడించి రూడ్ సెమీస్‌కు చేరుకున్నారు.

