కలం, వెబ్‌డెస్క్: ఏపీలో పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే 50 శాతానికి పైగా ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ క్రమంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ లీడర్ రోజా (Roja) ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద కన్నీళ్లు పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. చిత్తూరు జిల్లాలోని నగరిలో డిగ్రీ కాలేజీ కౌంటింగ్ కేంద్రం ఈ ఘటన చోటు చేసుకుంది. కౌంటింగ్ సందర్భంగా రోజా ఉదయమే కేంద్రానికి చేరుకున్నారు. కౌంటింగ్ తర్వాత ఎన్నికల అధికారులు ముందుగా విజయపురం మండలం ఇలత్తూరు ఎంపీటీసీ స్థానంలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించారని ప్రకటించారు. పది ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థిపై గెలుపొందారని చెప్పారు. ఆ తర్వాత కొద్ది సేపటికే మళ్లీ టీడీపీ అభ్యర్థి గెలుపొందారని ప్రకటించారు.
దీంతో వైసీపీ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. రీ కౌంటింగ్ నిర్వహించాలని అధికారులను రిక్వెస్ట్ చేశారు. అయితే రీ కౌంటింగ్ చేయకుండా వైసీపీ అభ్యర్థిని బలవంతంగా బయటకు పంపించేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. దీంతో వైసీపీ నేతలు రోజా ఆధ్వర్యంలో కౌంటింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అక్కడి నుంచి చెదరగొట్టారు. దీంతో రోజా కారు ఎక్కారు. అధికారులు, పోలీసుల తీరుపై రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కారులో ఉండి కూడా రోజా నినాదాలు చేశారు. వైసీపీ అభ్యర్థి గెలిచినా టీడీపీ అభ్యర్థి గెలిచాడని ఎలా ప్రకటిస్తారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. రీకౌంటింగ్ చేపట్టి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

