భార్యను కడతేర్చిన ఏఆర్ కానిస్టేబుల్.. వెలుగులోకి భయానక నిజాలు!

​కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించిన భవాని హత్యోదంతం (Bhavani Murder) పోలీసుల విచారణలో భయానక నిజాలు వెలుగుచూశాయి. భార్యను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భర్తే ఆమె ప్రాణాలు తీసి, సాక్ష్యాలు లేకుండా చేసేందుకు బాడీని గోదావరి నదిలో పడేసిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు.

​కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మహిళ అదృశ్యం కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. గుండారపు స్వరూప అనే మహిళ నవంబర్ 6న తన సోదరి భవాని కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ విచారణలో భాగంగా భవాని భర్త, టేకులపల్లి మండలం గోలియాతండాకు చెందిన ఏఆర్‌పీసీ-623 బోడా నరేందర్ (30)ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా విస్మయకర విషయాలు బయటపడ్డాయి.

​హత్య, మృతదేహం మాయం:

నవంబర్ 3వ తేదీ రాత్రి సుమారు 8 గంటల సమయంలో నిందితుడు నరేందర్ కొత్తగూడెం లోని తన అద్దె ఇంటిలో భార్య భవానితో గొడవపడి, చేతులతో నులిమి, చున్నీతో గొంతు బిగించి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం ఆ మృతదేహాన్ని ఒక తెల్లని సంచిలో ఉంచి తన స్వగ్రామమైన గోలియాతండాకు మోటార్ సైకిల్‌పై తీసుకెళ్లి వ్యవసాయ పొలంలో దాచిపెట్టాడు.​ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, నేరానికి సంబంధించిన సాక్ష్యాలను పూర్తిగా మాయం చేయాలనే ఉద్దేశంతో మరుసటి రోజు నవంబర్ 4వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో తన తండ్రి హరిలాల్ సహాయంతో మృతదేహాన్ని మళ్లీ మోటార్ సైకిల్‌పై భద్రాచలం గోదావరి బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లి నదిలో పడేసినట్లు నిందితుడు అంగీకరించాడు.

​పోలీసుల గాలింపు , రిమాండ్:

నిందితుడు తెలిపిన వివరాల ఆధారంగా అప్రమత్తమైన పోలీసులు, పంచుల సమక్షంలో శుక్రవారం గోదావరి నదిలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టి భవాని మృతదేహాన్ని విజయవంతంగా గుర్తించారు. ఈ కేసులో నిందితుడు బోడా నరేందర్‌ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని, నేరంలో ప్రమేయం ఉన్న ఎవరిపై అయినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు స్పష్టం చేశారు. ఈ కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, చుంచుపల్లి సీఐ ఆర్. వెంకటేశ్వర్లు, త్రీ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, వన్ టౌన్ సీఐ జితేందర్, అన్నపురెడ్డిపల్లి ఎస్ఐ విజయ్ సింహారెడ్డి, త్రీ టౌన్ ఎస్ఐ రమేష్‌తో పాటు సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>