మరికాసేపట్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు.. గెలుపెవరిదో?

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ (AP MPTC ZPTC) ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నేడు ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుండగా, వేలాది మంది అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనుంది. మొత్తం 9,821 ఎంపీటీసీ, 659 జడ్పీటీసీ స్థానాలకు గానూ 2,051 ఎంపీటీసీ, 77 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 7,767 ఎంపీటీసీ, 582 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరగ్గా, రాష్ట్రవ్యాప్తంగా 70.72 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

కౌంటింగ్ ప్రక్రియ కోసం 28 జిల్లాల పరిధిలో 365 కేంద్రాలను ఏర్పాటు చేసి, 9,062 టేబుళ్లను సిద్ధం చేశారు. ఈ ఓట్ల లెక్కింపులో 11,002 మంది సూపర్‌వైజర్లు, 28,692 మంది కౌంటింగ్ సహాయకులతో సహా మొత్తం 30 వేల మందికి పైగా సిబ్బంది పాల్గొంటున్నారు. భద్రత కోసం 19,885 మంది పోలీసులను రంగంలోకి దించడమే కాకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, డ్రోన్లు, బాడీ క్యామ్‌లతో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను, ఆ తర్వాత బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను లెక్కిస్తారు. ప్రక్రియ పూర్తయ్యాక విజేతల వివరాలను అధికారులు అధికారికంగా ప్రకటిస్తారు.

అయితే ఈ ఎన్నికలు బ్యాలెట్ పేపర్లతో జరగడం వల్ల విభజన ప్రక్రియ, చెల్లని ఓట్ల పరిశీలనకు కాస్త సమయం పడుతుంది. కాబట్టి కనీసం మధ్యాహ్నం 12 గంటల తర్వాతే స్పష్టమైన ఫలితాలు వెలువడుతాయని అధికారులు చెబుతున్నారు. మధ్యాహ్నం నుంచి ఒక్కొక్క స్థానం ఫలితం వెలువడనుండడంతో అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. సంక్షేమ , అభివృద్ధి పథకాలు తమను విజయతీరాలకు చేరుస్తాయని కూటమి అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తుండగా, ప్రభుత్వంపై వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థులు భావిస్తున్నారు. మరి చివరికి విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>