చరిత్రలో నిలిచేలా ఇరిగేషన్‌ పనులు: మంత్రి ఉత్తమ్

కలం, మిర్యాలగూడ: నీటిపారుదల మంత్రిగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టుల పరంగా స్వర్ణయుగంగా నిలిచిపోతుందని, చరిత్రలో నిలిచిపోయేలా ఇరిగేషన్ పనులను చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. శుక్రవారం మిర్యాలగూడ పట్టణ సమీపంలోని తుంగపహాడ్ వద్ద రూ.33 కోట్ల అంచనాతో నిర్మించిన 560 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపు పత్రాలను అందజేశారు.

తుమ్మిడిహెట్టి పనులు త్వరలోనే ప్రారంభం..

అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు సాగునీరు అందించే డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను వేగవంతం చేయడంతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.

బస్వాపూర్, ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి, తోపుచర్ల, కేశవాపూర్, కొండ్రపోలు, దున్నపోతుల గండి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పూర్తి చేస్తామని తెలిపిన మంత్రి, దామరచర్ల మండలం శాంతి నగర్, రావుల పెంట వాగులపై ఒక్కొక్కటి రూ.9 కోట్ల వ్యయంతో చెక్ డ్యామ్‌లను, అలాగే వజీరాబాద్ మేజర్ లైనింగ్ పనులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అర్హులకు పారదర్శకంగా రేషన్ కార్డులు మంజూరు చేసి నాణ్యమైన సన్న బియ్యం అందిస్తున్నామని చెప్పారు.

4 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్లు..

ముఖ్య అతిథిగా హాజరైన శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను నెరవేర్చడంలో భాగంగా రాష్ట్రంలో మొదటి విడతలో 4 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్లు అందించామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా మిగిలిన ఇళ్లను పూర్తి చేసి పేదలకు పంచాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. అనంతరం నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇళ్లు రానివారు నిరాశ పడొద్దని, రాబోయే విడతలో మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో భారీ ఇందిరమ్మ ఇళ్ల కాలనీ చేపట్టి అర్హులందరికీ మంజూరు చేస్తామన్నారు.

తుంగపహాడ్ కాలనీకి తన ఎంపీ నిధుల నుంచి గ్రంథాలయం, ఓపెన్ జిమ్‌ను, దామరచర్ల-రాజాపేట అండర్ పాస్‌ను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. 7 ఎకరాల 24 గుంటల స్థలంలో 24 బ్లాకుల్లో 560 ఇళ్లను అన్ని మౌలిక వసతులతో నిర్మించామని తెలిపారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో విప్ వేముల వీరేశం, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎస్పీ శరత్ చంద్ర పవార్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>