మనిషి తనను తాను సరిదిద్దుకోవటమే గొప్ప సంస్కరణ: వెంకయ్య నాయుడు

కలం, వెబ్ డెస్క్: మనిషి తనను తాను సరిదిద్దుకోవడం కంటే గొప్ప సంస్కరణ మరొకటి లేదని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) అన్నారు. హైదరాబాదులోని ఎంసీఆర్‌హెచ్ఆర్డీలో జర్నలిస్టు డాక్టర్ అరవింద్ యాదవ్ రచించిన 14వ దలైలామా జీవిత చరిత్ర ‘మన కాలం బుద్ధుడు’ పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి వెంకయ్య నాయుడు వర్చువల్ గా హాజరై ప్రసంగించారు. ప్రతిరోజూ కొంత సమయం కేటాయించి ఆత్మపరిశీలన చేసుకుంటే మన ఆలోచనలు, నిర్ణయాలు, ప్రవర్తనలో పరిపక్వత వస్తుందని పేర్కొన్నారు. వ్యక్తుల్లో ఈ మార్పు వచ్చినప్పుడు కుటుంబాల్లో కలహాలు, సమాజంలో విద్వేషాలు తగ్గి శాంతి నెలకొంటుందని, శాంతి ఉన్నచోటే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.

ఈ సందర్భంగా రచయిత డాక్టర్ అరవింద్ యాదవ్ ని, పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన సీనియర్ జర్నలిస్టు మెరుగుమాల నాంచారయ్యని వెంకయ్య అభినందించారు. తెలుగులోకి ఈ పుస్తకాన్ని తీసుకురావడం మంచి విషయమని అన్నారు. మాతృభాషలో చదవటం వలన విషయం తొందరగా బోధపడుతుందన్నారు. ఒక మహనీయుడి గొప్ప తాత్విక సంప్రదాయాన్ని, మానవీయ జీవన విధానాన్ని ఈ పుస్తకం ద్వారా పరిచయం చేశారని పేర్కొన్నారు. సమకాలీన చరిత్రను కళ్లకు కట్టే ఇలాంటి పుస్తకాలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందన్నారు. గౌతమ బుద్ధుడి బోధనలను తన జీవన విధానం, నడవడిక ద్వారా ఆచరించి చూపించిన దలైలామా జీవితం ఈ పుస్తకంలో ప్రతిబింబిస్తోందని చెప్పారు.

రాజభోగాల్లో పెరిగిన సిద్ధార్థుడు రాజ్యాన్ని, అధికారాన్ని, సంపదను, కుటుంబ సౌఖ్యాన్ని వదిలి సత్యాన్వేషణకు బయలుదేరారని వెంకయ్యనాయుడు గుర్తుచేశారు. ఎన్నో సంవత్సరాల సాధన, అన్వేషణ అనంతరం బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొంది బుద్ధుడిగా మారారని, బుద్ధుడికి కలిగిన జ్ఞానోదయం మాదిరిగానే సామాన్య మానవుడికి కూడా తన దైనందిన జీవితంలో లౌకిక జ్ఞానోదయం అవసరమని స్పష్టం చేశారు. ఇందుకు పెద్దగా ప్రయత్నించాల్సిన అవసరం లేదని, ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. దలైలామా కేవలం బౌద్ధ ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదని.. కరుణ, సహనం, అహింస, శాంతి, మానవీయ విలువలకు ప్రతిరూపమని పేర్కొన్నారు.

జన్మభూమిని స్వర్గంతో పోల్చిన శ్రీరామచంద్రుడి మాటలను గుర్తుచేస్తూ, దలైలామాకు తన జన్మభూమి టిబెట్ పట్ల అచంచలమైన ప్రేమ ఉందని వెంకయ్యనాయుడు అన్నారు. చిన్నతనంలోనే టిబెట్ ఆధ్యాత్మిక నాయకత్వ బాధ్యతలు స్వీకరించిన ఆయన, అక్కడి ప్రజల భవిష్యత్తు కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారని అన్నారు. అనివార్య పరిస్థితుల్లో టిబెట్ నుంచి నిష్క్రమించి భారతదేశంలో ఆశ్రయం పొందాల్సి వచ్చిందని, మాతృభూమికి దూరంగా ప్రవాస జీవితం గడపడం ఎంతటి వేదనతో కూడుకున్నదో అర్థం చేసుకోవచ్చన్నారు.

బౌద్ధ ధర్మానికి, భారతీయ సనాతన ధర్మ సంప్రదాయానికి ఎన్నో సారూప్యతలు ఉన్నాయని వెంకయ్య నాయుడు  చెప్పారు. బౌద్ధం భారత గడ్డపైనే ఆవిర్భవించిందని, బుద్ధుడు జన్మించిన నేపాల్‌లోని లుంబినీ నుంచి జ్ఞానోదయం పొందిన బోధ్‌గయ వరకు, తొలి ధర్మోపదేశం చేసిన సారనాథ్ నుంచి మహాపరినిర్వాణం పొందిన కుశీనగర్ వరకు ఈ ప్రాంతాలన్నీ భారత ఉపఖండ ఆధ్యాత్మిక చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. భారతీయ తాత్విక చింతన మూలాల నుంచి ఉద్భవించిన బౌద్ధ ధర్మం ప్రపంచానికి విశిష్టమైన జీవన మార్గాన్ని పరిచయం చేసిందని పేర్కొన్నారు. అహింస, కరుణ, దయ, ఆత్మనిగ్రహం, సత్యాన్వేషణ, మానవీయ విలువలకు బౌద్ధ, సనాతన ధర్మ సంప్రదాయాలు ప్రాధాన్యతనిస్తాయని వివరించారు.

ఈ కార్యక్రమంలో మహాబోధి బుద్ధ విహార భిక్షువుల బృంద నాయకులు భిక్కు బుద్ధ పాల, టిబెటన్ పండితులు, బౌద్ధ భిక్షువు ప్రొఫెసర్ గేషే నవాంగ్ సామ్తెన్, సీనియర్ జర్నలిస్టు, మాజీ ఆర్టీఐ కమిషనర్ ఆర్. దిలీప్ రెడ్డి, రచయిత డాక్టర్ అరవింద్ యాదవ్, అనువాదకులు మెరుగుమాల నాంచారయ్య, అజు పబ్లికేషన్స్ ప్రచురణకర్త ఎర్రం శ్వేత, డెక్కన్ క్రానికల్ కార్టూన్ ఎడిటర్ షేక్ సుభాని, సీనియర్ జర్నలిస్టు, యాంకర్ స్వప్న తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>