కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: పాలమూరు జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులు పంజా (ACB Raids) విసురుతున్నా.. కొందరు ప్రభుత్వ ఉద్యోగుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఏసీబీ దాడులు మామూలే.. మా దారి మాదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి (డీవైఎస్వో) లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటమే ఇందుకు నిదర్శనం.
మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా కేంద్రంలో గురువారం ఏసీబీ అధికారులు నిర్వహించిన మెరుపు దాడిలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి జక్కు రాజశేఖర్ రెడ్డి, కాంట్రాక్ట్ టైపిస్ట్ గోరె ఉమేశ్‌లు పట్టుబడ్డారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలోని వాలీబాల్ హాస్టల్ క్రీడాకారులకు ఆహారం సరఫరా చేసిన ఓ క్యాటరింగ్ నిర్వాహకుడికి దాదాపు రూ.3.10 లక్షల పెండింగ్ బిల్లులు మంజూరు కావాల్సి ఉంది. ఈ బిల్లుల క్లియరెన్స్ కోసం డీవైఎస్వో రూ. లక్ష లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. లంచం సొమ్ము రూ.లక్ష తీసుకుంటుండగా రాజశేఖర్ రెడ్డిని, సహకరించిన టైపిస్ట్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
కేవలం క్రీడా శాఖలోనే కాదు, గత కొన్ని నెలలుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ, మున్సిపల్, ట్రెజరీ తదితర శాఖల్లో వరుసగా ఏసీబీ దాడులు జరుగుతున్నప్పటికీ అవినీతికి అడ్డుకట్ట పడటం లేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ ఏడాది జనవరి నుండి నేటి వరకు 11 ఏసీబీ కేసులు నమోదయ్యాయి. అయినా అధికారుల తీరులో మార్పు రావడం లేదు. ఇటీవల సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సూపరింటెండెంట్ బొమ్మిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి కూడా రూ.15,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అలాగే గత నెల నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట సబ్ డివిజన్ ట్రెజరీ కార్యాలయంలో ఏవోగా పని చేస్తున్న కందాడ వెంకటయ్య మెడికల్ బిల్లులను మంజూరు చేయడానికి రూ.25 వేల లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు రూ.22 వేల రూపాయలు ఫోన్ పే ద్వారా చెల్లించి , మిగతా మూడు వేల రూపాయలను నగదుగా ఇచ్చారు. అనంతరం బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించి ఆధారాలతో సహా చూయించి సంబంధిత అధికారి అరెస్ట్ చేసేందుకు సహకరించారు. గతంలో మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారి కూడా లంచం కేసులో అరెస్ట్ అయిన సందర్భాలు జిల్లాలో ఉన్నాయి.
ఈ ఏడాది జరిగిన ఏసీబీ దాడులు
నవంబర్ 5న గురువారం మహబూబ్‌నగర్ క్యాటరింగ్ బిల్లుల మంజూరు కోసం రూ.లక్ష లంచం తీసుకుంటూ జిల్లా యువజన, క్రీడల అధికారి జక్కుల రాజశేఖర్ రెడ్డి, కాంట్రాక్ట్ టైపిస్ట్ ఉమేష్ ఏసీబీకి చిక్కారు. అక్టోబర్ నెలలో క్లోరినేషన్ ప్లాంట్ అనుమతి కోసం రూ.1.65 లక్షలు లంచం తీసుకుంటూ మహబూబ్‌నగర్ మున్సిపల్ కమిషనర్ వడ్డే సురేందర్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఆగస్టు నెలలో నాగర్ కర్నూల్ జిల్లా లింగాల ఫారెస్ట్ రేంజ్ పరిధిలో లంచం తీసుకుంటూ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రాంబాబు, బీట్ ఆఫీసర్ మురళీకృష్ణ పట్టుబడ్డారు. జూలైలో మహబూబ్ నగర్ జిల్లాలో భూమి మ్యాప్ సవరణ కోసం రూ.15,000 లంచం తీసుకుంటూ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సూపరింటెండెంట్ బొమ్మిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు.
ఏప్రిల్ నెలలో నారాయణపేట జిల్లాలో జనన ధృవీకరణ పత్రాల జారీకి సంబంధించి రూ. 25,000 లంచం తీసుకుంటూ నారాయణపేట ఆర్డీఓ (ఆర్డీవో) పాత్లావత్ రామచందర్ పట్టుబడ్డారు. అలాగే మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎం.కిషన్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. సోదాల్లో రూ.12 కోట్లకు పైగా ఆస్తులను అధికారులు గుర్తించారు. భూత్పూర్ మండలం రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాల సుబ్రమణ్యం కూడా లంచం కేసులో అరెస్ట్ అయ్యారు.
గత ఏడాది పలు కేసులు
అలాగే గత ఏడాది ఆగస్టు నెలలో రూ.3,000 లంచం తీసుకుంటూ మహబూబ్‌నగర్ ఇరిగేషన్ ఏఈఈ మహ్మద్ ఫయాజ్ పట్టుబడ్డారు. జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ ఆకస్మిక తనిఖీలు చేపట్టి లెక్కల్లో లేని నగదును స్వాధీనం చేసుకుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టేందుకు ఏసీబీ తన నిఘాను పెంచింది. ఎవరైనా ప్రభుత్వ అధికారి లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ సూచిస్తోంది.
మారని తీరు.. ప్రజల ఆగ్రహం
ఒకవైపు అధికారులు ఏసీబీ వలలో చిక్కుతున్నా, మరొకవైపు ప్రభుత్వ కార్యాలయాల్లో సామాన్యుల పనులు పైసలు లేనిదే కదలడం లేదని ప్రజలు వాపోతున్నారు. అధికారులు జైలుకు వెళ్తున్నా, తోటి ఉద్యోగుల్లో భయం కలగకపోవడం, పాత పద్ధతులే కొనసాగుతుండటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

