చెర్లబూత్కూర్‌లో పంట కోత వివాదం.. పోలీసులకు ఫిర్యాదు

కలం, కరీంనగర్ : వ్యవసాయ భూమిలో చేతికొచ్చిన పంటను తనకు తెలియకుండా హార్వెస్టర్‌తో కోసుకెళ్లారని ఆరోపిస్తూ ఓ మహిళ రూరల్ పోలీసులను ఆశ్రయించింది. గ్రామ సర్పంచితో పాటు మరో ఐదుగురిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కోట పూర్ణ కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం పూసాల గ్రామానికి చెందిన కోట పూర్ణ (38)కు కరీంనగర్ జిల్లా చెర్లబూత్కూర్ (Cherlabuthkur) గ్రామ శివారులోని సర్వే నంబర్లు 45/బి, 46/ఎ/2లో 110 గుంటల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి ఆమె కుమారుడు కోట రాంచరణ్ పేరుతో పట్టాదారు పాస్‌పుస్తకంలో నమోదై ఉంది. రెండు నెలల క్రితం కూర శ్రీనివాస్‌రెడ్డి నుంచి ఈ భూమిని కొనుగోలు చేసినట్లు ఆమె పేర్కొంది.

అనుమతి లేకుండా పంట కోత

ఈ నెల 4వ తేదీ రాత్రి చెర్లబూత్కూర్ గ్రామ సర్పంచి నరేశ్‌రెడ్డితో పాటు బుర్ర నారాయణ, పవన్‌కళ్యాణ్, పల్లె మణెమ్మ, కూర రాజిరెడ్డి, పల్లె సాగర్ తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తమ భూమిలోని పంటను హార్వెస్టర్‌తో కోసుకెళ్లారని పూర్ణ ఆరోపించింది. తమ భూమికి దారి లేకపోయినా, ఇతరుల భూమిలో నుంచి లోపలికి ప్రవేశించి పంటను కోసినట్లు ఫిర్యాదులో పేర్కొంది.

సర్పంచి చెప్పడంతోనే కోశానన్న హార్వెస్టర్ యజమాని

పంట కోత విషయమై హార్వెస్టర్ యజమాని సాయిని శంకర్‌ను ఫిర్యాదుదారు ప్రశ్నించగా, సర్పంచి నరేశ్‌రెడ్డి కోసుకురమ్మని చెప్పడంతోనే పంట కోసినట్లు తెలిపాడని పూర్ణ పేర్కొంది. తనకు రావాల్సిన పంటను అన్యాయంగా కోసుకెళ్లిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది.

క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం: కరీంనగర్ రూరల్ సీఐ

ఈ ఘటనపై రూరల్ టౌన్ సీఐని వివరణ కోరగా.. పోలీసు సిబ్బందిని ఘటనాస్థలానికి పంపించి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిస్తామని తెలిపారు. వాస్తవాలు తెలుసుకున్న అనంతరం బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>