కలం, ఆదిలాబాద్ : విద్యార్థుల్లో నూతన ఆలోచనలు, పరిశోధనాత్మక దృక్పథం, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించేందుకు జిజ్ఞాస ప్రాజెక్టులు ఎంతగానో దోహదపడుతున్నాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీల్లో (Jignasa Competitions) విశేష ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థులకు శుక్రవారం స్థానిక ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో బహుమతి ప్రదానోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ఐదు విజేత బృందాలకు నగదు బహుమతుల చెక్కులు అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు తరగతి గదులకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి, సమాజంలోని సమస్యలను అధ్యయనం చేయాలని సూచించారు. చరిత్ర, గిరిజన సంస్కృతి, అడవులు, వన్యప్రాణులు, గణితశాస్త్రం, స్మార్ట్ హెల్త్‌కేర్ సిస్టమ్స్ వంటి విభిన్న అంశాలపై విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు అభినందనీయమన్నారు. పుస్తక జ్ఞానంతో పాటు సమాజ సమస్యలను అన్ని కోణాల్లో విశ్లేషించి, వాటికి పరిష్కారాలు అన్వేషించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థుల పరిశోధనలను జిల్లా స్థాయిలో మరింత ప్రోత్సహించి, వాటిని క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రాజెక్టుల రూపకల్పనలో ఎదురయ్యే లోపాలను గుర్తించి, ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలన్నారు. చిన్నస్థాయి ప్రాజెక్టులతో ప్రారంభించి పీజీ, పీహెచ్డీ స్థాయిల వరకు పరిశోధనలను విస్తరించాలని సూచించారు.
స్మార్ట్ ట్రాకింగ్ సిస్టమ్స్ వంటి వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శనలకే పరిమితం చేయకుండా కళాశాలల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో అమలు చేసి ఫలితాలు సాధించాలని పేర్కొన్నారు. ఆదివాసీ గూడేల్లో నెలకొన్న మూఢనమ్మకాలు, విద్యకు దూరమవుతున్న పిల్లల సమస్యలను గుర్తించి, స్వచ్ఛంద విద్యా అవగాహన కార్యక్రమాల ద్వారా పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పోటీల్లో సాధించిన నగదు బహుమతులను ఆయా ప్రాజెక్టుల అభివృద్ధి, విస్తరణకు వినియోగించాలని విజేతలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు డాక్టర్ జె. సంగీత, డాక్టర్ అతీక్ బేగం, టి. ప్రతాప్ సింగ్, జిజ్ఞాస జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ అరుణ్ కుమార్, సూపర్వైజర్లు యోగలక్ష్మి, కట్ట రమేశ్, నర్సింగరావు, ఆర్. పృథ్వీరాజ్, స్రవంతి, అధ్యాపకులు పాల్గొన్నారు.

