విద్య, ఉపాధి, తాగునీటిపై కలెక్టర్లకు సీఎస్ కీలక ఆదేశాలు

కలం, యాదాద్రి భువనగిరి: రాబోయే వేసవిలో రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి (Drinking Water) సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు కార్యాచరణకు సిద్ధమవుతోంది. మరోవైపు విద్యాశాఖలో పెండింగ్ పనులు, ఉపాధి హామీ పథకం అమలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, నిర్మాణాల పురోగతిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ లక్ష్యాల సాధనలో జిల్లాల పనితీరు మెరుగుపడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు (CS Sanjay Jaju) జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు.

శుక్రవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ పథకాల అమలు, నిధుల వినియోగం, అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి కలెక్టర్ అనురాగ్ జయంతి, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి పాల్గొన్నారు.

వేసవికి ముందే తాగునీటి సమస్యలకు చెక్

వేసవి కాలం ముగిసే వరకు తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎస్ ఆదేశించారు. ప్రతి జిల్లాలో ప్రత్యేక తాగునీటి కమిటీలు ఏర్పాటు చేసి వారానికోసారి సరఫరా పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. నవంబర్ 15లోగా చేతిపంపులు, బోర్ పంపులు, బహిరంగ బావులకు సంబంధించిన మరమ్మతులు పూర్తి చేయాలని గడువు విధించారు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పరిష్కరించాలని స్పష్టం చేశారు.

ఉపాధి కల్పనలో 5.5 లక్షల మందికి పనులు

VBGRAMG పథకం అమలుపై సమీక్షిస్తూ ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు సగటున 5.5 లక్షల మంది కూలీలు ఉపాధి పొందుతున్నారని సీఎస్ వెల్లడించారు. గత సంవత్సరాల్లో నవంబర్ నెలలో సగటున 25 వేల మందికే పనులు కల్పించగా, ప్రస్తుతం గణనీయమైన పెరుగుదల నమోదైందని తెలిపారు. మార్చి నెలాఖరులోగా 12 కోట్ల పనిదినాల లక్ష్యాన్ని చేరుకోవాలని, చేపట్టే పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.

పాఠశాలల్లో పెండింగ్ పనులకు మోక్షమెప్పుడు?

సమగ్ర శిక్ష అభియాన్, పీఎం శ్రీ పథకాల కింద మంజూరైన నిధులను జనవరి మొదటి వారంలోగా గరిష్టంగా 100 శాతం వినియోగించాలని సూచించారు. అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, ఇతర మరమ్మతులను పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాలలను అధికారులు తరచూ సందర్శిస్తూ విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం, అల్పాహార పథకాల అమలును పర్యవేక్షించాలని తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతపై ప్రత్యేక దృష్టి

ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతలో ఇప్పటివరకు 43 వేల ఇళ్లకే మంజూరు లభించిందని సీఎస్ వెల్లడించారు. మిగిలిన అర్హుల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్లకు సూచించారు. ప్రజాప్రతినిధులు, ఇందిరమ్మ కమిటీలతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. లబ్ధిదారులకు సిమెంట్ బస్తాను రూ.230కే అందించేలా చర్యలు తీసుకోవాలని, ఒక్కో బస్తాపై రూ.100 మేర ప్రయోజనం కలుగుతుందని వివరించారు.

సోషల్ మీడియాలోనూ ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం

ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, సోషల్ మీడియా ఖాతాలు, హ్యాష్‌ట్యాగ్‌ల ద్వారా ప్రచారం చేయాలని సీఎస్ సూచించారు. పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లకు కొత్త లోగోతో స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

జిల్లా అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పీఎం శ్రీ పాఠశాలల్లో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఆదేశించారు. పనుల పురోగతిపై స్పష్టమైన నివేదిక అందించాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. జిల్లాలో వ్యక్తిగత ఇంకుడు గుంతలు, బోర్‌వెల్ రీఛార్జ్ నిర్మాణాలు, పంట కుంటల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. భూసేకరణ ప్రక్రియలో పెండింగ్ అంశాలను పరిష్కరించడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత మంజూరును వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్డీఓ నాగిరెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి తదితర అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>