కలం, మంథని: మంథని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో (Manthani Congress) సస్పెన్షన్లవ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. తమపై ఎలాంటి షోకాజ్ నోటీసు జారీ చేయకుండా, వివరణ తీసుకోకుండానే సస్పెన్షన్ (Suspensions) విధించడంపై బాధిత కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు TPCC అధ్యక్షుడు, పార్టీ క్రమశిక్షణా సంఘం కమిటీకి ఫిర్యాదు లేఖ అందజేశారు.
ఈ సందర్భంగా బాధిత నేతలు కీలక ఆరోపణలు చేశారు. మంథని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ తమను సస్పెండ్ చేసినట్లు తెలియజేస్తూ, మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకే ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పారని తమ ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. అసలు తమకు ఎలాంటి షోకాజ్ నోటీసు ఇవ్వకుండా, తమ వివరణ తెలుసుకోకుండా ఏకపక్షంగా సస్పెన్షన్ విధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
మల్లారం గ్రామంలో నిరుపేద పిల్లలకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేసే సేవా కార్యక్రమంలో పాల్గొంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? అని వారు ప్రశ్నించారు. స్థానిక రాజకీయాలు, తప్పుడు సమాచారంతోనే తమపై కక్షపూరితంగా చర్యలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటూ, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్నామని తెలిపారు.
క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం కష్టపడే నాయకులపై ఇలాంటి ఏకపక్ష చర్యలు తీసుకోవడం పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల వల్ల ప్రత్యర్థి పార్టీలకు రాజకీయంగా లాభం చేకూరే ప్రమాదం ఉందని పేర్కొంటూ, పార్టీ అధిష్ఠానం వెంటనే జోక్యం చేసుకుని తమపై విధించిన సస్పెన్షన్లను రద్దు చేయాలని బాధిత కాంగ్రెస్ నాయకులు విజ్ఞప్తి చేశారు.

