BRS అవినీతి దాహానికి కాళేశ్వరం బ‌లైంది.. సీతక్క ఫైర్

కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ అవినీతి దాహానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ బ‌లైందని మంత్రి సీతక్క (Minister Seethakka) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలు, అవినీతి కారణంగానే నిర్మాణం పూర్తయిన కొద్ది కాలానికే బ్యారేజీ దెబ్బతిన్నదని చెప్పారు. రూ.లక్షల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టు పరిస్థితి నేడు ఎలా ఉందో ప్రజలకు తెలులు అని చెప్పారు. కాళేశ్వరం చుట్టూ బీఆర్ఎస్ నాయకులు రాజకీయాలు చేయడం మానేసి, ప్రాజెక్ట్ వాస్తవాలను ప్రజలకు వివరించాలన్నారు.

పల్లె పల్లెకు సీతక్క కార్యక్రమంలో భాగంగా మంత్రి సీతక్క ములుగు (Mulugu) నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. రామ‌ప్ప దేవాల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేసిన అనంత‌రం ప‌ల్లె పల్లెకు కార్య‌క్ర‌మంలో పాల్గోన్నారు. గ్రామాలకు చేరుకున్న మంత్రికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కార్యకర్తల కోలాహలం మధ్య పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండాలను ఆవిష్కరించి ప్రజలతో మమేకమయ్యారు. గ్రామాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.

కాళేశ్వరం వద్ద నీటిని నిల్వ చేయడం వల్ల ప్రమాదం ఉందని కేంద్ర డ్యామ్ సేఫ్టీ అధికారులు సూచించారని మంత్రి సీతక్క తెలిపారు. కన్నాయిగూడెం, ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపురం ప్రాంతాలతో పాటు పినపాక, భద్రాద్రి ప్రాంతాలకు వ‌ర‌ద ముప్పు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించిన నేపథ్యంలోనే అక్కడ నీటి నిల్వ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. డ్యామ్ సేఫ్టీ అధికారుల సూచనలకు అనుగుణంగానే చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.

గోదావరి జలాలను వృథా కాకుండా వివిధ మార్గాల ద్వారా అవసరమైన ప్రాంతాలకు తరలిస్తున్నామని సీతక్క తెలిపారు. దేవాదుల, తుపాకులగూడెం ప్రాజెక్టుల ద్వారా నీటిని వినియోగించుకునే చర్యలు చేపడుతున్నామని, నీటి ప్రవాహం అధికంగా ఉన్నప్పుడు సీతారామ ప్రాజెక్టులో నీటిని నింపుతూ అవసరమైన విధంగా వినియోగిస్తున్నామని చెప్పారు. రామప్ప చెరువును నింపడంతో పాటు, అక్కడి నుంచి పరిసర ప్రాంతాల మండలాలకు నీటిని అందించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ములుగు జిల్లాలో తాగునీరు, సాగునీటి అవసరాలు ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నదే ప్రభుత్వ విధానమని పేర్కొన్నారు.

దేవాదుల ప్రాజెక్టు ద్వారా నర్సంపేట, పాలకుర్తి, జనగాం, స్టేష‌న్ ఘ‌న్ పూర్ తదితర నియోజ‌వ‌క‌ర్గాల‌కు కూడా నీటిని త‌ర‌లిస్తున్నామ‌ని తెలిపారు. గోదావరిలో లభ్యమయ్యే ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి రైతులకు, ప్రజలకు ఉపయోగపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. నీటి నిర్వహణకు సంబంధించిన వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు.

దేశంలోని అనేక ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోనూ వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, ఇది ప్రకృతిలో వచ్చిన మార్పుల ఫలితమని మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ రైతులు, పేదలకు అండగా నిలవాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన అని చెప్పారు. సన్నబియ్యాన్ని ప్రజలకు అందించే స్థాయికి రాష్ట్రం చేరుకుందని గుర్తుచేశారు. రైతులు పండించే పంటకు గిట్టుబాటు, ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించడం రెండింటికీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>