కలం, వెబ్ డెస్క్: సింగూరు డ్యాం నుంచి రైతులకు కాకుండా బీర్ కంపెనీలకు నీళ్లు అందిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యాంలో 20 టీఎంసీల నీరు ఉండేవని.. రిపేర్ల పేరిట మొత్తం ఖాళీ చేయడంతో 2 టీఎంసీలున్నాయని వివరించారు. మళ్లీ నీళ్లు కూడా నింపకపోవడంతో రాయణఖేడ్ ప్రాంత ప్రజలకు మూడు రోజుల కోసారి, జహీరాబాద్లో రెండు రోజులకోసారి నీళ్లు వస్తున్నాయని ఆరోపించారు.
ఐఐటీ హైదరాబాద్, బీడీఎల్, బీహెచ్ఈఎల్ కంపెనీలకు నీళ్లు ఇవ్వలేమని ప్రభుత్వం నేరుగా చెప్పేసిందని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి ప్రజలంతే అంత చులకనా..? అని ప్రశ్నించారు. ఒక్క నర్సాపూర్ నియోజకవర్గంలోనే 15 వేల మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. ఏడుపాయల అమ్మవారు, మెదక్ చర్చి మీద ఒట్టేసి మరీ సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని విమర్శించారు.
నువ్వు ఎందుకు ఇవ్వడం లేదు..?
తెలంగాణ పొరుగున ఉండే మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు తక్షణ కరువు సాయం కింద ప్రతి రైతుకు రూ.5 వేలు సాయం అందిస్తున్నాయని హరీశ్ రావు తెలిపారు. మరి సీఎం రేవంత్ ఎందుకు ఇవ్వడం లేదని విమర్శించారు. 25 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతే కేబినెట్ సమావేశంలో చర్చించకుండా.. గ్లోబల్ సమ్మిట్ ఎలా పెట్టాలని ఆలోచిస్తున్నారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుబంధు వచ్చిందని రైతులకు సీఎం రేవంత్ రెడ్డి పేరిట మెసేజ్లు వస్తున్నాయని.. తెచ్చుకుందామని బ్యాంకులకు రైతులు వెళితే మాత్రం అవి ఫేక్ అని పంపించేస్తున్నారని హరీశ్ రావు వివరించారు. సీఎం రేవంత్ పేరిట ఫేక్ మెసేజ్లు వస్తుంటే.. ఎందుకు ఇంతవరకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. వీటి వెనుక ఆయనే ఉన్నారా..? అని అనుమానం వ్యక్తం చేశారు.

