కలం, వెబ్ డెస్క్: కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) చేపట్టిన సర్ ప్రక్రియలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత ఉన్నప్పటికీ వివిధ కారణాలతో ఓటర్ల జాబితాలో పేర్లు కోల్పోయినవారు మరోసారి తమ పేర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యాణా, ఢిల్లీ రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.
ఆబ్సెంట్, మరో చోటకు వెళ్లిపోవడం, చనిపోవడం, నకిలీ పత్రాలను కలిగి ఉన్నారనే ఓటర్ నమోదు ఫారాలను తిరిగి ఇవ్వలేరని వారికి ఎన్నికల సంఘం ఈ అవకాశం వర్తిస్తుందని పేర్కొంది. వెంటనే వీళ్ల జాబితాను ఆయా గ్రామ పంచాయతీలు, వార్డు కార్యాలయాల్లో ప్రదర్శించాలని సూచించింది. వారికి మరోసారి బూత్ లెవల్ అధికార్ల సాయంతో కొత్త ఫారాలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ఇళ్ల తనిఖీలు చేపట్టి..
అర్హత కలిగి ఓటర్ల జాబితాలో పేర్లు మిస్సైయినవారిని గుర్తించేందుకు వారి అడ్రస్ ఆధారంగా ఇళ్ల తనిఖీలు కూడా చేపట్టాలని ఎన్నికల సంఘం సూచించింది. ఈ విషయంలో అవసరమైతే వివిధ పార్టీలు, చుట్టుపక్కల వారు, వారితో సంబంధం ఉన్నవారి సాయం తీసుకోవాలని కూడా పేర్కొంది. అలాంటి వారిని గుర్తించాక.. ఫారాలను తిరిగి ఎలా సమర్పించాలో కూడా బూత్ లెవల్ అధికారులకు తగిన సూచనలు చేయాలని ఎన్నికల కమిషనర్లకు వివరించింది. ఒకవేళ అర్హులైన ఓటర్లు మరో చోటకు తమ అడ్రస్ మార్చుకున్నట్లు పేర్కొంటే, వారిని ఫారం–సి సమర్పించేలా చూడాలని పేర్కొంది. దీనిలో వారు ఉంటున్న చిరునామా, ఏ అసెంబ్లీ నియోజకవర్గం కింద వస్తుందో స్పష్టంగా తెలిపేలా నింపాలని ఆదేశించింది.

