కలం, నల్లగొండ బ్యూరో: నల్లగొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ (Nalgonda DMHO ) ఆఫీసు అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా తయారైంది. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన వైద్యారోగ్య శాఖ అధికారులే అక్రమాలకు తెగబడ్డారు. జాజ్ కోసం ఏకంగా ఫేక్ డెత్ సర్టిఫికెట్ సృష్టించారు. కారుణ్య నియామకం పేరిట రూ. లక్షల్లో దందా కు పాల్పడ్డారు. ఆపై తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అర్ధరాత్రి ఆఫీస్ రిజిస్టర్లు చింపివేయడం, తప్పుడు సమాధానాలు చెప్పడం జిల్లావ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
నల్లగొండ జిల్లా శాలిగౌరారం మెడికల్ ఆఫీసర్ నకిలీ సర్టిఫికెట్ జారీ చేయడంతోనే కారుణ్య నియామక దందాకు దిగినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. రిటైర్మెంట్ అయి చనిపోయిన వ్యక్తిని సర్వీసులో ఉండగానే చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించి, ఆయన స్థానంలో మరొవ్యక్తిని ఆఫీస్ సబార్డినేట్‌గా నియమించారు. ఆపై అతని పేరు సర్వీస్ రిజిస్టర్లో ఎక్కించి విధుల్లోకి పంపారు. ఇదిలా ఉంటే.. ఫేక్ డెత్ సర్టిఫికెట్‌పై వచ్చి ప్రతిపాదన డీఎంహెచ్‌వో ఆఫీసు రెండుసార్లు తిరస్కరించినా, మూడోసారి మళ్లీ పంపారు. దీని వెనుక రూ. 40 లక్షలు చేతులు మారిన ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి. చివరకు జిల్లా కలెక్టర్ కల్పించుకుని విచారణకు ఆదేశాలు జారీ చేయడంతోనే శాలిగౌరారం మెడికల్ ఆఫీసర్‌పై సస్పెన్షన్ వేటుకు దారితీసింది.
అసలు నియామకమే జరగలేదని..
ఫేక్ సర్టిఫికెట్ జారీ వ్యవహారంపై ప్రశ్నించగా “అసలు నియామకమే జరగలేదు” అని నల్లగొండ డీఎంహెచ్‌వో డాక్టర్ రాహుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే.. గత నెల 26న అక్రమంగా పోస్టింగ్ పొందిన రాజు కూడా అదే నెల 30 తేదీ వరకు డ్యూటీకి హాజరైనట్లు ఆధారాలు వెలుగుచూశాయి. దామరచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అటెండెన్స్ రిజిస్టర్లో రాజు పేరు ఉండడంతో విచారణలో అధికారులు నీళ్లు నమిలారు. ఇది కాస్త బయటకు పొక్కడంతో అదే రోజు అర్ధరాత్రి వైద్యాధికారులు, సిబ్బంది కలిసి పాత అటెండెన్స్ రిజిస్టర్‌ను చింపివేశారు. కొత్త రిజిస్టర్ రాసి తీవ్ర అక్రమాలకు పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది.
పోలీసుల ఎంట్రీతో మారిన సీన్..
ఫేక్ డెత్ సర్టిఫికెట్ ద్వారా ఒకరి జాబ్ నియామకంపై నల్లగొండ వన్ టౌన్ పోలీసులు సీరియస్‌గా తీసుకుని ఎంక్వైరీ చేపట్టారు. వన్ టౌన్ ఇన్చార్జ్ సీఐ ఆదిరెడ్డి, ఎస్ఐ వెంకటనారాయణ నేతృత్వంలో డీఎంహెచ్‌వో ఆఫీసులో గురువారం విస్తృతంగా తనిఖీలు చేశారు. ఇందులో భాగంగా ఎస్ఐ వేసిన ప్రశ్నలకు డీఎంహెచ్ వో ఆఫీసు సూపరింటెండెంట్ జితేందర్ రెడ్డి, సెక్షన్ క్లర్క్ మోహన్, సీసీ రంజిత్ సమాధానాలు చెప్పేందుకు తడబడ్డారని తెలిసింది. అయితే.. విచారణలో భాగంగా పోలీసులు డీఎంహెచ్‌వో ఆఫీసు ఏఓతో పాటు మరొక సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో సైతం ఫేక్ డెత్ సర్టిఫికెట్ల జారీపై తనిఖీలు కొనసాగుతున్నాయి.
పెద్దలను కాపాడేందుకేనా..?
ఫేక్ సర్టిఫికెట్ స్కామ్ లో డీఎంహెచ్‌వో ఆఫీసులోని ఉన్నతాధికారులే అసలు సూత్రధారులనే అనుమానాలు బలపడుతున్నాయి. వారి కనుసన్నల్లోనే రూ. లక్షల్లో చేతులు మారాయని, నియామకాల నాటకం నడిచిందనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే, ప్రధాన నిందితులను కాపాడేందుకు కేవలం మెడికల్ ఆఫీసర్‌ను మాత్రమే సస్పెండ్ చేసి, కింది స్థాయి సిబ్బందికి షోకాజ్ నోటీసులు ఇస్తూ డ్రామా నడిపిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు విచారణ వేగవంతమైతే మరికొందరు అక్రమార్కులు బయటపడనుండగా వారిపైనా వేటు పడే అవకాశం ఉంది.
కార్పొరేషన్ అధికారుల సంగతేంటి..?
మరోవైపు నల్లగొండ కార్పొరేషన్ అధికారుల తీరు కూడా తీవ్ర విమర్శల పాలైంది. ఫేక్ డెత్ సర్టిఫికెట్తో కారుణ్య నియామం ఇవ్వడం ఎంత పెద్ద నేరమో.. సర్టిఫికెట్ జారీ చేయడం కూడా అంతకుమించిన నేరం అవుతుంది. అయితే, దీన్ని మున్సిపల్ అధికారులు తేలిగ్గా తీసుకుంటూ కంటితుడుపు చర్యలతో సరిపెడుతూ కాలయాపన చేస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం కమిషనర్ సెలవుల్లో ఉన్నారు. అయితే.. అక్రమాలకు పాల్పడిన సిబ్బందికి నోటీసులతోనే సరిపెట్టడం వెనుక ఉన్నతాధికారుల హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ స్కామ్ లో భాగస్వామిగా ఉన్న ఒక కీలక అధికారి పేరు పదోన్నతుల జాబితాలో ఉండటంతోనే ఆయనను కాపాడేందుకే శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు తాత్సారం చేస్తున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. మొత్తంగా ఫేక్ డెత్ సర్టిఫికెట్తో డీఎంహెచ్‌వో ఆఫీసు అక్రమ నియామకానికి సూత్రధారులుగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోకుండా మున్సిపల్ యంత్రాంగం కాలయాపన చేయడం వెనుక ఉన్న మతలబు ఏంటనే ప్రశ్నలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి.

