కలం, కరీంనగర్ బ్యూరో: నగర ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ (Kolagani Srinivas) పిలుపు నిచ్చారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి, త్రాగు నీటి వసతి సౌకర్యాల కల్పనలో భాగంగా గురువారం 31వ డివిజన్ దుర్గమ్మగడ్డ హనుమాన్ దేవాలయాన్ని సందర్శించారు. దేవాలయంలో స్వామి వారికి ప్రత్యేత పూజలు చేసి మొక్కలు చెల్లించుకున్నారు. అనంతరం స్థానిక కార్పోరేటర్ ముఖద్దర్ హుస్సెన్ అలీతో కలిసి మంచి నీటి బోరు మోటారును అధికారికంగా ప్రారంభం చేశారు.
ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. నగరంలోని ప్రతి డివిజన్ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మా పాలకవర్గం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ప్రస్తుత ఎల్ నినో ప్రభావం, రానున్న వేసవి కాలం దృష్ట్యా.. నగర ప్రజల త్రాగు నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నగరంలో ప్రజల త్రాగు నీటి సరఫరాలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూస్తున్నట్లు తెలిపారు.
ప్రజలకు ప్రాధాన్యతగా మంచి నీటి వసతి సౌకర్యాలతో పాటు డివిజన్లలో రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి క్రార్యక్రమాల లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు తెలిపారు. వివిధ గ్రాంట్ల ద్వారా ప్రజల మౌలిక వసతుల కల్పన కోసం చేపట్టిన పనులను ప్రారంభం చేసి శరవేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దుర్గమ్మ గడ్డ పరిసర ప్రాంతాల్లోని భక్తులకు, స్థానిక ప్రజలకు తాగునీటి సమస్య తీర్చేందుకు ఈ బోరు మోటార్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, నగరపాలక సంస్థ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, పాల్గొన్నారు.

