కలం, జగిత్యాల: జగిత్యాల (Jagtial) రూరల్ మండలం చెల్గల్ గ్రామానికి చెందిన ఇప్పల ప్రకాష్ (Ippala Prakash) ప్రపంచ ప్రఖ్యాత ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను విజయవంతంగా చేరుకుని గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. సముద్ర మట్టానికి 5,364 మీటర్ల (17,598 అడుగుల) ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను చేరుకోవడం సాధారణ విషయం కాదు. అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు, గడ్డకట్టే చలి, మంచుతో నిండిన పర్వత మార్గాలు, తక్కువ ఆక్సిజన్ వంటి ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ ప్రకాష్ తన లక్ష్యాన్ని చేరుకున్నారు.
ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్రలో అడుగడుగునా ఎదురయ్యే ప్రకృతి సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ, శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, పట్టుదలతో తన ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ విజయం ఆయనలోని సాహస స్ఫూర్తికి, లక్ష్య సాధన పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది. ప్రస్తుతం ఇప్పల ప్రకాష్ నాప్ట్రిక్స్ల్యాబ్స్ సాఫ్ట్వేర్ స్టూడియోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తూనే సాహసయాత్రలపై ఆసక్తిని పెంచుకుని, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రకాష్ ఈ అరుదైన విజయాన్ని సాధించడం విశేషం. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఉద్యోగం చేస్తూ తన వ్యక్తిగత ఆసక్తులు, లక్ష్యాలకు సమయం కేటాయించి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు ప్రయాణించడం యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.
ఇప్పల ప్రకాష్‌ను అభినందించిన చెల్గల్ గ్రామ సర్పంచ్ రాజేందర్ :
చెల్గల్ గ్రామానికి చెందిన యువకుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను చేరుకోవడం గ్రామ ప్రజలందరికీ గర్వకారణమని చెల్గల్ గ్రామ సర్పంచ్ పేర్కొన్నారు. ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూనే తన అభిరుచికి ప్రాధాన్యతనిస్తూ ఇంతటి సాహసయాత్రను విజయవంతం చేయడం అభినందనీయమన్నారు. ప్రకాష్ సాధించిన ఈ ఘనత గ్రామంలోని యువతకు ఎంతో స్ఫూర్తినిస్తుందని, ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాలను నిర్దేశించుకుని పట్టుదలతో ముందుకు సాగాలని చెల్గల్ గ్రామ సర్పంచ్ రాజేందర్ ఆకాంక్షించారు. చెల్గల్ గ్రామం నుంచి హిమాలయ పర్వతాల వరకు సాగిన ఇప్పల ప్రకాష్ సాహస ప్రయాణం గ్రామానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి గ్రామానికి, జగిత్యాల జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని గ్రామ సర్పంచ్ రాజేందర్ ఆకాంక్షిస్తూ ఇప్పల ప్రకాష్‌కు అభినందనలు తెలిపారు.

