అర్హులకే ఇళ్లు కేటాయించాలి.. ఆర్డీవోకు వినతిపత్రం అందజేత‎

‎కలం, మిర్యాలగూడ: మిర్యాలగూడ (Miryalaguda) మున్సిపాలిటీ పరిధిలో గత ప్రభుత్వ హయాంలో మంజూరైన 565 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో పూర్తి పారదర్శకత పాటించి, అర్హులైన పేదలకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్థ డిమాండ్ చేశారు. గురువారం మిర్యాలగూడ రెడ్డి కాలనీలోని పార్టీ కార్యాలయంలో పట్టణ బీఆర్ఎస్ కమిటీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం ఎదుట నిర్వాసితులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్డీవో రమణారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ప్రత్యేక కృషితో మిర్యాలగూడ మున్సిపాలిటీకి 565 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరయ్యాయని గుర్తుచేశారు. అందులో 40 ఇళ్లను భూ నిర్వాసితులకు కేటాయించగా.. మిగిలిన ఇళ్లకు దరఖాస్తులు స్వీకరించి వార్డుల వారీగా ప్రజల సమక్షంలో లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేశామన్నారు. అయితే 194 ఇళ్లకు సంబంధించి ఎంపికైన వారికి అర్హత లేదనే కారణంతో గతంలో పట్టాలు ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం ఎలాంటి దరఖాస్తులు స్వీకరించకుండా, సర్వే నిర్వహించకుండా ఇష్టారాజ్యంగా కేటాయింపులు చేపట్టడం సరైంది కాదని మండిపడ్డారు.

‎మున్సిపాలిటీలోని ఒక వార్డు వారికి మరొక వార్డులో, పట్టణ పరిధిలో నివసించని బయటి మండలాల వారికి ఇక్కడ ఇళ్లు కేటాయించడం సమంజసం కాదని పేర్కొన్నారు. అలాగే భూములు, ఇళ్లు కోల్పోయిన గుమాస్తాల కాలనీ, గుబిలి కాలనీ నిర్వాసితులలో మిగిలిన ఏడుగురికి కూడా తక్షణమే న్యాయం చేయాలని కోరారు. 194 ఇళ్లకు సంబంధించి తిరిగి కొత్తగా దరఖాస్తులు స్వీకరించి, మున్సిపాలిటీలోని 48 వార్డుల్లో సమగ్ర సర్వే నిర్వహించి నిజమైన నిరుపేదలను గుర్తించాలని అన్నారు. వార్డుల వారీగా పారదర్శకంగా లాటరీ పద్ధతిలోనే ఇళ్లను కేటాయించాలన్నారు. ఎలాంటి రాజకీయ జోక్యం, అక్రమాలకు తావులేకుండా నిరుపేదలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>