బేతుపల్లి చెరువులో సాహసోపేత ఆపరేషన్.. NDRF, SDRF సిబ్బందికి సన్మానం!

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా ​సత్తుపల్లి మండల పరిధిలోని బేతుపల్లి చెరువు వద్ద చోటుచేసుకున్న ఉత్కంఠభరిత ఘటన సుఖాంతమైంది. చిమ్మచీకటిలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సాహసంతో 16 మంది ప్రాణాలు కాపాడిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ (NDRF), ఎస్‌డీఆర్‌ఎఫ్‌ (SDRF), ఫైర్ సిబ్బందిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) ఘనంగా సన్మానించి భావోద్వేగానికి గురయ్యారు.

​బేతుపల్లి చెరువులో చిక్కుకున్న 8 మంది మత్స్యకారులను రక్షించేందుకు వెళ్లిన ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం పడవ ప్రమాదవశాత్తూ బోల్తా పడిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన సమాచారం అందుకున్న మంత్రి తుమ్మల వెంటనే స్పందించి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్నతాధికారులు, స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద విజయ్‌కుమార్‌లతో కలిసి సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షించారు. ​

సత్తుపల్లి పట్టణంలోని అటవీ శాఖ కార్యాలయ గెస్ట్ హౌస్‌లో రెస్క్యూ సిబ్బందిని సన్మానించిన సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ… “మీ పోరాట ప్రతిమ అమోఘం.. మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. చిమ్మచీకటిలో ధైర్యంగా 16 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున, జిల్లా ప్రజల తరఫున నా ధన్యవాదాలు. మీరు ఈ జిల్లా కీర్తి ప్రతిష్టలను పెంచారు” అని కొనియాడారు.

​ఈ సంఘటనను రాత్రి నుంచి దగ్గరుండి పర్యవేక్షించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులకు, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ విజయ్‌కుమార్‌కు, అలాగే సహాయక చర్యల్లో పూర్తి సహకారం అందించిన చుట్టుపక్క గ్రామాల ప్రజలకు, పార్టీ యంత్రాంగానికి మంత్రి తుమ్మల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>