కలం, తెలంగాణ బ్యూరో: ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu)పై బీఆర్ఎస్ నేతల వైఖరి గతంతో పోలిస్తే ఇప్పుడు మారిపోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటు బీఆర్ఎస్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఎన్నిసార్లు ఫీల్డ్ విజిట్ చేసినా ఆ పార్టీకి ఆశించిన మైలేజ్ రావడం లేదు. ఈ నిందల నుంచి బయటపడే మార్గం లేకుండా పోయింది. కన్నేపల్లి పంప్ హౌజ్ నుంచి నీటిని లిఫ్ట్ చేయాలని ప్రభుత్వం మీద తీసుకొచ్చిన ఒత్తిడి కూడా వర్కవుట్ కాలేదు. చివరకు ఎల్‌నినో కరువు అంశాన్ని ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేస్తున్నది.
‘ముందుచూపు ఉన్న నేత’ అంటూ..
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ముందుచూపుతో వ్యవహరిస్తూ ఉంటే ఆయన శిష్యుడైన రేవంత్‌రెడ్డి చేతకాని సీఎంగా మారారంటూ కేటీఆర్, హరీశ్‌రావు పోటాపోటీగా విమర్శలు చేస్తున్నారు. కృష్ణా, గోదావరి జలాలను ఒడిసిపట్టుకుని ఎల్‌నినో కరువు నుంచి రాష్ట్రాన్ని కాపాడలేని అసమర్థుడంటూ సీఎం రేవంత్‌రెడ్డిని ఘాటుగా విమర్శిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును తెలంగాణ ద్రోహి, జల దోపిడీదారు అంటూ విమర్శించిన కేటీఆర్, హరీశ్‌రావు ఇప్పుడు ఆయనను ‘ముందుచూపు ఉన్న నేత’గా దార్శనికుడంటూ ప్రశంసిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగ, విపక్షంలో ఉన్నప్పుడు మరోలా చంద్రబాబుపై బీఆర్ఎస్ నేతల వైఖరి మారడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
చంద్రబాబుపై అప్పుడు కేసీఆర్ ఫైర్..
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరంటారు. ఎవరికైనా రాజకీయ ప్రయోజనాలే శాశ్వతం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ విధానాలకు ఇది సరిగ్గా సరిపోతుంది. రాష్ట్రంలో పదేండ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన్ను ‘తెలంగాణ ప్రాజెక్టుల విధ్వంసకుడు’గా, ‘తెలంగాణ ద్రోహి’గా అభివర్ణించారు. తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన సందర్భంగా చంద్రబాబుపై కేసీఆర్ నిప్పులు చెరిగారు.
“చంద్రబాబు ఒక శని.. రాజకీయాల్లో అత్యంత నీచమైన, కుటిల మనస్తత్వమున్న వ్యక్తి… డర్టీ పొలిటీషియన్.. తెలంగాణ నీటి హక్కులను హరించివేయడానికి శతవిధాలా ప్రయత్నించిన తెలంగాణ ద్రోహి’’అంటూ ఘాటు పదాలతో ఫైర్ అయ్యారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావలసిన న్యాయమైన వాటాను రాకుండా అడ్డుకున్న జల దోపిడీదారు.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పటి నుంచే కృష్ణా జలాల దోపిడీకి పునాది పడింది… శ్రీశైలంలో 800 అడుగుల కంటే తక్కువ మట్టంలో నీటిని దొంగిలించడానికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచి తెలంగాణను ఎండబెట్టిన నీటి దొంగ..” అని కేసీఆర్ విమర్శించారు.
‘పుట్టుకతోనే తెలంగాణ విరోధి’ అన్న హరీశ్‌రావు
తెలంగాణ ఇరిగేషన్ మంత్రిగా ఉన్న సమయంలో హరీశ్‌రావు సైతం చంద్రబాబుపై చాలా సందర్భాల్లో ధ్వజమెత్తారు. “చంద్రబాబు పుట్టుకతోనే తెలంగాణ విరోధి… తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలను ఎడారిగా మార్చడానికి చూస్తున్న అసలైన తెలంగాణ ద్రోహి… కృష్ణా నది నుంచి చుక్క నీరు కూడా తెలంగాణకు రాకుండా పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తోడేసిన నీటి దొంగ… గతంలో చంద్రబాబు హయాంలో ప్రారంభించిన అక్రమ కట్టడాలే ఈనాటి కృష్ణా జలాల వివాదానికి కారణం… తెలంగాణ హక్కులను కాలరాసిన జల దోపిడీదారు ఆయన… ఏపీలో ఏ ప్రభుత్వం ఉన్నా కృష్ణా నీటిని అక్రమంగా తరలించడంలో చంద్రబాబు మైండ్ గేమ్ నడుస్తోంది..” అంటూ 2016 అక్టోబర్, 2018 నవంబర్, 2021 జూలైలో వేర్వేరు సందర్భాల్లో చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
తెలంగాణ గొంతు కోశారని కేటీఆర్ ఆగ్రహం..
కేటీఆర్ సైతం పలు సందర్భాల్లో చంద్రబాబుపై ధ్వజమెత్తారు. “చంద్రబాబు తెలంగాణ అభివృద్ధిని, నీటి ప్రాజెక్టులను నిలిపివేయడానికి కేంద్రానికి 30కి పైగా లేఖలు రాసిన ద్రోహి… తెలంగాణ గొంతు కోసేందుకు కృష్ణా జలాలను దొంగిలించారు.. కృష్ణా నదిపై ఉమ్మడి పాలనలో జరిగిన జల దోపిడీకి సూత్రధారి చంద్రబాబు నాయుడే… పాలమూరు ఎండిపోవడానికి, నల్లగొండలో ఫ్లోరోసిస్ రావడానికి చంద్రబాబు చేసిన నీటి పాపాలే కారణం.. స్వార్థ రాజకీయాల కోసం ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వాటా కృష్ణా నీటిని తరలించుకుపోయిన ‘ఫస్ట్ నంబర్ జల దొంగ’.. చంద్రబాబు నైజం ఎప్పటికీ మారదు” అంటూ విమర్శించారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణను ఎండబెట్టినట్లే, ఇప్పుడు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, డిండి ప్రాజెక్టులను ఆపడానికి కేంద్రానికి లేఖలు రాస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ”గోదావరి నదిపై పట్టిసీమ పేరుతో నాటకమాడి, తెలంగాణ వాటాను దెబ్బతీయడానికి చంద్రబాబు కుట్రలు అన్నీ ఇన్నీ కావు… గోదావరి జలాల మళ్లింపును అడ్డుకోవడానికి నిరంతరం ప్రతిబంధకాలు సృష్టించిన ఏకైక నాయకుడు చంద్రబాబు..” అంటూ తనదైన శైలిలో కేటీఆర్ విమర్శించారు. అధికారంలో ఉన్నంతకాలం చంద్రబాబు తీరును తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల కోసమేనా?
ఎడారిలాంటి రాయలసీమలోని కుప్పం దాకా నీటిని తీసుకెళ్లేందుకు చంద్రబాబు చూపించిన పట్టుదల, దార్శనికత నేటి సీఎం రేవంత్ రెడ్డికి లేవు అంటూ కేటీఆర్, హరీశ్ వ్యాఖ్యానించారు. బహిరంగంగానే చంద్రబాబుకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. విపక్షంలో ఉన్నప్పుడు ద్రోహిగా, శత్రువుగా కనిపించిన చంద్రబాబు ఇప్పుడు వారికి పరిపాలనాదక్షుడిగా కనిపించడం సరికొత్త చర్చకు దారితీసింది.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాలు, నల్లగొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ జిల్లాల్లోని తెలుగుదేశం, చంద్రబాబు అభిమానుల ఓట్లకు ఈ రూపంలో గాలం వేస్తున్నారన్నది కాంగ్రెస్ నాయకుల ఆరోపణ. ఆంధ్రప్రదేశ్‌కు సరిహద్దుగా ఉన్న ఖమ్మం, నల్లగొండ జిల్లాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ, రంగారెడ్డి జిల్లాల్లో ఉంటున్న ఆంధ్రా సెటిలర్ గ్రాడ్యుయేట్ ఓటర్లను ఆకట్టుకునే రాజకీయ వ్యూహమనే మాటలూ వినిపిస్తున్నాయి. కొత్తగా చంద్రబాబుపై ప్రశంసల వెనుక ఉన్నది ఆయనపై అభిమానం కాదని, సీఎం రేవంత్ రెడ్డిని దెబ్బకొట్టడానికి వేసిన ఓ పొలిటికల్ స్కెచ్ అన్నది కొందరి వాదన.

