కలం, వనపర్తి: మహిళలు త్వరగా చదవడం రాయడం నేర్చుకుంటే నగదు బహుమతి ఇస్తానని మంత్రి జూపల్లి (Jupally Krishna Rao) ప్రకటించారు. బుధవారం పానగల్ మండలంలోని తెల్లరాళ్లపల్లి (Tellarallapally) గ్రామంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి గ్రామంలో నిరక్షరాస్య మహిళలకు పలకలు, బలపాలు పంపిణీ చేశారు. వీటి కొనుగోలుకు గతంలో రూ.10 వేల ఆర్థిక సాయం అందించిన ఆయన, అక్షరాస్యత కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగాలని సూచించారు. మహిళలు అక్షరాస్యులైనప్పుడే ఆత్మవిశ్వాసంతో పాటు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు.
ప్రతి ఒక్కరికీ చదవడం, రాయడం రావాలన్నదే తన ఆకాంక్ష అని పేర్కొన్నారు. మహిళలకు ప్రతిరోజూ ఉదయం గంట, సాయంత్రం గంట చొప్పున ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు ఉపాధ్యాయులను నియమించాలని సర్పంచ్ జంబలయ్యను ఆదేశించారు. ఇందుకోసం మరో రూ.20 వేల ఆర్థిక సాయం అందించారు. చదువుకు వయసుతో సంబంధం లేదని మంత్రి (Jupally Krishna Rao) పేర్కొన్నారు. ముందుగా చదవడం, రాయడం నేర్చుకునే మహిళకు రూ.5 వేల నగదు బహుమతి ప్రకటించారు. మహిళల విద్యతో కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతాయని మంత్రి అన్నారు.
Also Read : ఎన్నికల కమిషనర్ల పదవీ భద్రతపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Follow Us On : WhatsApp

