పంట నష్టాల సర్వే పూర్తి చేయాలి: కలెక్టర్ ప్రియాంక

కలం, నారాయణపేట: ఎల్‌నినో ప్రభావంతో నారాయణపేట జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంట నష్టాల అంచనా సర్వేను క్షేత్రస్థాయిలో వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ప్రియాంక (Collector Priyanka) వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కరువు ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి పంట నష్టాల వివరాలను సమగ్రంగా నమోదు చేయాలని ఆమె సూచించారు.

బుధవారం జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ-క్రాప్ బుకింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే సర్వేయర్లు, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు) క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాల శాతాన్ని, ప్రభావిత రైతుల వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయాలన్నారు. పంట నష్టానికి సంబంధించిన సమాచారాన్ని సంబంధిత యాప్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేసి, సర్వేను అత్యంత వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ చట్టం కింద రైతులకు అందించాల్సిన సహాయక చర్యలు సకాలంలో అందాలంటే పంట నష్టాల అంచనా ప్రక్రియలో ఎలాంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. అధికారులు ఆలస్యం చేసే ప్రతి రోజు రైతులకు అందాల్సిన సహాయం మరింత ఆలస్యమవుతుందని గుర్తించి బాధ్యతతో పనిచేయాలన్నారు. వ్యవసాయ శాఖ పనితీరుకు సంబంధించి ప్రతి నెల రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ నుంచి జిల్లాల వారీగా నివేదికలు వస్తున్నాయని, అందులో నారాయణపేట జిల్లా పలు అంశాల్లో మెరుగైన స్థానంలో ఉన్నప్పటికీ ఏఈఓల క్షేత్రస్థాయి పర్యటనలు, హాజరు, లాగిన్ వినియోగం వంటి అంశాల్లో వెనుకబడి ఉందని కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.

గత ఆరు నెలలుగా ఈ అంశాలపై సమీక్షిస్తూ మెరుగుదలకు తగిన సమయం ఇచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదన్నారు. నవంబర్ నెలకు సంబంధించిన ఏఈఓల హాజరు, క్షేత్రస్థాయి పర్యటనలు, వ్యవసాయ అధికారుల పనితీరుపై ప్రత్యేక నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. నిర్దేశించిన గడువులోగా పనితీరును మెరుగుపరచుకోని ఏఈఓలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఉద్యోగి తనకు అప్పగించిన బాధ్యతలను స్వీయ క్రమశిక్షణతో, పూర్తి నిబద్ధతతో నిర్వర్తించాలని సూచించారు.

ధన్వాడ (Dhanwada) మండలంలో ఈ క్రాప్ సర్వే వెనకబడి ఉండటంపై ఏఈవోను నిలదీస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణ మండలంలో ఈ-క్రాప్ సర్వే 99.72 శాతం, అప్రూవల్ 99.52 శాతం పూర్తి చేయడంపై అధికారులను అభినందించారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో రైతులు నీటి లభ్యతను అంచనా వేయకుండా అప్పులు చేసి బోర్లు వేయడం, పంటల సాగు కోసం పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని కలెక్టర్ (Collector Priyanka) పేర్కొన్నారు.

వ్యవసాయ బోర్ల ఏర్పాటుకు సంబంధించి వాల్టా చట్టం ప్రకారం అవసరమైన అనుమతులు తీసుకోవాలని, గ్రౌండ్ వాటర్ శాఖ అనుమతి లేకుండా బోర్లు వేయడాన్ని ప్రోత్సహించవద్దని అధికారులకు సూచించారు. రైతులకు భూగర్భ జలాల పరిస్థితి, నీటి లభ్యత, ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై స్పష్టమైన అవగాహన కల్పించాలన్నారు. గత సీజన్‌లో ఎల్‌నినో ప్రభావం గురించి ముందుగానే అవగాహన కల్పించినప్పటికీ చాలామంది రైతులు అధిక పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయారని గుర్తు చేశారు.

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ సీజన్‌లో రైతులు ఆచితూచి పంటలు సాగు చేసేలా, నీటి పొదుపు చర్యలు పాటించేలా వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాగునీటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. నారాయణపేట జిల్లా ఈ ఏడాది సుమారు 45 నుంచి 50 శాతం లోటు వర్షపాతంతో తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొంటోందని, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి అధికారి అప్రమత్తంగా పనిచేయాలని అన్నారు.

వ్యవసాయ శాఖ అధికారులు, ఏఈఓలు తమ పనితీరును తక్షణమే మెరుగుపరుచుకోవాలని, వచ్చే మంగళవారం నిర్వహించే సమీక్షా సమావేశం నాటికి ఈ-క్రాప్ బుకింగ్, అప్రూవల్, ఏఈఓల హాజరు, క్షేత్రస్థాయి పర్యటనలు, పంట నష్టాల సర్వే తదితర అన్ని అంశాల్లో స్పష్టమైన పురోగతి కనిపించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు కొడంగల్ నియోజక వర్గంలో నిర్వహించనున్న రైతు మేళా కార్యక్రమానికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. రైతుల సమీకరణ, వారికి స్వాగతం పలకడం, ఆస్తుల పంపిణీ కార్యక్రమం, రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనే రైతుల ఎంపిక తదితర అంశాలపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలన్నారు.

Also Read : తెగిన ‘పెద్దవాగు’ ప్రాజెక్టు రింగ్ కట్ట.. దిగువ ప్రాంతాలకు హెచ్చరిక!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>