కలం, వెబ్ డెస్క్ : ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) ఈడీ విచారణ ముగిసింది. ఈ మేరకు అంబటి రాంబాబు హైదరాబాద్లోని ఈడీ (ED) జోనల్ కార్యాలయంలో అధికారుల ముందట హాజరై తన వాంగ్మూలాన్ని అందించారు. గతంలో వైసీపీ హయాంలో జరిగిన మద్యం రవాణా సబ్-కాంట్రాక్టుల్లో సుమారు రూ.19.58 కోట్ల మేర నిధుల మళ్లింపు జరిగిందనే ఆరోపణలపై అధికారుల బృందం ఆయనను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
విచారణ అనంతరం అంబటి రాంబాబు (Ambati Rambabu) విలేకరులతో మాట్లాడుతూ.. ఈడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు పూర్తి స్థాయిలో సమాధానమిచ్చానని, విచారణకు పూర్తిగా సహకరించానని స్పష్టం చేశారు. తన ప్రధాన అనుచరులైన మర్రి సుబ్బారెడ్డి, రాయపాటి పురుషోత్తంలకు మద్యం రవాణా సబ్-కాంట్రాక్టులు దక్కడంపై ఈడీ ఆరా తీసిందని వివరించారు. ప్రజాప్రతినిధిగా తన వద్దకు వచ్చిన అనుచరులను కాంట్రాక్టుల కోసం మద్యం బోర్డు మాజీ MD వాసుదేవరెడ్డికి సిఫార్సు చేయడం సహజమేనని, అయితే కేవలం సిఫార్సు చేసినంత మాత్రాన నేరం చేసినట్లు కాదని చెప్పారు.
అయితే సిఫార్సు చేసిన తర్వాత వారికి కాంట్రాక్టులు ఎలా దక్కాయి, తదనంతరం ఏం జరిగిందనే వివరాలు తనకు తెలియవని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. కాగా, ఈ కేసులోనే గతంలో మర్రి సుబ్బారెడ్డి, రాయపాటి పురుషోత్తంలను కూడా ఈడీ విచారించిన నేపథ్యంలో, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇచ్చిన వాంగ్మూలం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Also Read : రూ.60 కోట్ల మిర్చి ఎగుమతులకు బ్రేక్.. కేంద్రం సాయం కోరిన సీఎం చంద్రబాబు
Follow Us On : WhatsApp

