కలం, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట (Yadagirigutta)లో గంజాయి విక్రయాలు, కొనుగోళ్ల వ్యవహారం మరోసారి కలకలం రేపింది. పట్టణంలోని పాతగుట్ట ప్రాంతంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారంతో SOT బృందం, యాదగిరిగుట్ట పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. గంజాయి విక్రయిస్తున్న, కొనుగోలు చేసేందుకు వచ్చినట్లు అనుమానిస్తున్న నలుగురిని పోలీసులు పట్టుకున్నారు.
వారి నుంచి 24 ప్యాకెట్లలో ఉన్న 191 గ్రాముల గంజాయితో పాటు రూ.600 నగదు, మూడు ఫోన్లు, ఒక స్కూటీని పోలీసులు సీజ్ చేశారు. కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు. నిందితులను జమిదార్ గోపాల్, పిట్టల సన్నీ అలియాస్ సందీప్ , దేశం శ్రీ చరణ్, అశ్రర్ బెషుగా గుర్తించారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ దాడుల్లో పట్టణ సీఐ భాస్కర్, ఎస్సైలు యాదయ్య, ప్రసాద్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

