కలం, వనపర్తి: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేకపోయిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) ప్రశ్నించారు. అల్వాలలో హరీశ్‌రావు చేసిన విమర్శలకు కౌంటర్‌గా మంగళవారం వనపర్తిలోని డీసీసీ కార్యాలయంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. రూ.60 వేల కోట్లతో పూర్తికావాల్సిన ప్రాజెక్టుకు రూ.25 వేల కోట్లు ఖర్చు చేసి 90 శాతం పనులు పూర్తయ్యాయని ఎలా చెబుతారని నిలదీశారు. ప్రస్తుత అంచనాల ప్రకారం ప్రాజెక్టు పూర్తి చేయడానికి మరో రూ.80 వేల కోట్లు అవసరమవుతాయని పేర్కొన్నారు. జూరాల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 10 టీఎంసీలేనని, అక్కడి నుంచి రామన్‌పాడుకు సమాంతర కాలువ నిర్మాణంలో ఉన్న సాంకేతిక లోపాలను గతంలోనే సూచించినా పట్టించుకోలేదన్నారు.
అప్పుడే నీరు అందేది..
గూడెం దొడ్డి రిజర్వాయర్(Gudem Doddi Reservoir)ను 15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించి ఉంటే వేలాది ఎకరాలకు సాగునీరు అందేదని మంత్రి జూపల్లి (Jupally Krishna Rao) గుర్తు చేశారు. మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం ద్వారా 4.60 లక్షల ఎకరాలకు నీరందించే అవకాశం ఉండేదని తెలిపారు. కల్వకుర్తి ప్రాజెక్టులో మోటార్లను గతంలోనే ఎందుకు పూర్తిస్థాయిలో వినియోగించలేదని ప్రశ్నించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే నీటి వినియోగంపై ప్రశ్నలు తలెత్తాయని విమర్శించారు. 2014–15లో 375 టీఎంసీల నీటిని వినియోగించుకున్నారని, ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్, హరీశ్‌రావుల నిర్ణయాలతో 511 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించారని ఆరోపించారు. నార్లాపూర్ నుంచి నీటిని విడుదల చేశామని, కల్వకుర్తి ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని వివరించారు.
నిరంజన్‌రెడ్డికి బీఫామ్ కూడా రాదు..
తొమ్మిదేళ్ల పాలనలో ఏం సాధించారో చెప్పకుండా ఇప్పుడు రైతుల గురించి మాట్లాడటం విడ్డూరమని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డికి వచ్చే ఎన్నికల్లో బీఫామ్ కూడా రాదని ఎద్దేవా చేశారు. ఆయన ‘నీళ్ల నిరంజన్ కాదు.. నీళ్ల దొంగ నిరంజన్’ అంటూ ఆరోపణలు గుప్పించారు. ఆయన ఫామ్‌హౌస్‌ల్లో అక్రమంగా బోర్లు వేయించి, రైతులకు అందాల్సిన సాగునీటిని తన ఫామ్‌హౌస్‌ల వైపు మళ్లించుకున్నారని ఆరోపించారు. గతంలో వరి సాగుపై హెచ్చరికలు చేసిన నేతలు ఇప్పుడు రైతుల సంక్షేమం గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. నిరుద్యోగుల సమస్యలపైనా గత పాలకులు సరైన విధంగా స్పందించలేదని విమర్శించారు.
కరువు పరిస్థితులపై ప్రత్యేక కమిటీ..
బీఆర్‌ఎస్ పాలనలో ఎన్ని ప్రాజెక్టులు నిర్మించారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసిందన్నది ఆ పార్టీ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (MLA Megha Reddy) సూచించారు. కరువు పరిస్థితులపై కేబినెట్ సమీక్షలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని, రైతులకు ఉపశమనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ సమావేశంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ మాధవి రమేష్, పెబ్బేరు మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతయ్య, పట్టణ అధ్యక్షుడు కదిరే రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి, వైస్ ఛైర్మన్ మధుసూదన్ గౌడ్, పెబ్బేరు మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ సుమిత్ర ఎల్లారెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు తైలం శంకర్ ప్రసాద్, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ శంకర్ నాయక్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Also Read : హైదరాబాద్‌లో నీళ్ల కొరత.. కాలేజీల కీలక నిర్ణయం!
Follow Us On: X(Twitter)

