కాంగ్రెస్ ఎమ్మెల్యే నియంతృత్వ పాలన నశించాలి: కొప్పుల ఈశ్వర్

కలం, కరీంనగర్ బ్యూరో: రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ స్థానిక ఎమ్మెల్యే నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రామగుండం (Ramagundam) ప్రాంతంలో చేపట్టిన అపూర్వ అభివృద్ధికి నిదర్శనంగా నిలిచిన ‘అభివృద్ధి ఫైలాన్’ను మున్సిపల్ అధికారులు దొంగచాటుగా తొలగించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ​ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో రామగుండంలో ఐటీ పార్క్, మౌలిక వసతులు, తాగునీటి పథకాలు సహా కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనుల జ్ఞాపకార్థం గోదావరిఖని గాంధీనగర్‌లో ఈ పైలాన్‌ను నిర్మించామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక, కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు ఈ అక్రమ కూల్చివేతకు పాల్పడ్డారని మండిపడ్డారు.

ఈ మేరకు మున్సిపల్ అధికారుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా విధులు నిర్వహించాల్సిన అధికారులు మరియు మున్సిపల్ కమిషనర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు తొత్తులుగా వ్యవహరించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. “ఎమ్మెల్యే ఏది చెబితే అది చేయడమే అధికారుల పనా?” అని నిలదీశారు. రామగుండంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి అక్రమాలు కొత్తేమీ కాదని, గత కొన్ని నెలలుగా చివరకు దేవాలయాలను కూడా వదలకుండా కూల్చివేస్తున్నారని గుర్తు చేశారు.

​కట్టడాలను కూల్చివేసినంత మాత్రాన ప్రజల గుండెల్లో నిలిచిపోయిన బీఆర్ఎస్ అభివృద్ధిని, కేసీఆర్ జ్ఞాపకాలను చెరిపివేయడం కాంగ్రెస్ నాయకుల వల్ల కాదని కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) స్పష్టం చేశారు. రామగుండం ప్రజల హక్కుల పరిరక్షణ కోసం, గత ప్రభుత్వ అభివృద్ధి ఆనవాళ్ల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని, అధికారుల అక్రమాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతుందని హెచ్చరించారు.

​అక్రమ కూల్చివేతను ప్రశ్నించినందుకు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, నాయకులు మూల విజయ రెడ్డి, కౌశిక్ హరి, వ్యాళ్ళ హరీష్ రెడ్డి, మురళీధర్ రావు, ఇతర బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసిన వారందరినీ తక్షణమే, బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Also Read : రాహుల్ జీ.. అక్రమ ఓట్లు తొలగిస్తే తప్పేంటి..? : బీజేపీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>