కలం, మహబూబ్ నగర్ బ్యూరో: పోలీస్ ఫ్లాగ్ డే – 2026 అమరవీరుల స్మారక వారోత్సవాల్లో భాగంగా రాష్ట్ర స్థాయిలో వ్యాస రచన, షార్ట్ ఫిలిం, ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహించారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి పాల్గొని ప్రతిభ కనబరిచిన వారికి మంగళవారం ఎస్పీ డి.జానకి (SP Janaki) మెరిట్ సర్టిఫికెట్లు, మెమొంటోలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు అందిస్తున్న సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే పోటీల ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం, రోడ్డు ప్రమాదాలు వంటి సామాజిక సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎస్పీ డి.జానకి సూచించారు. విద్యార్థులు, యువత తమ సృజనాత్మకతను సామాజిక ప్రయోజనాలకు ఉపయోగిస్తూ మంచి సందేశాలను సమాజానికి అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐ రవి బాబు, ఎస్పీ సీసీ రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

