రాహుల్ జీ.. అక్రమ ఓట్లు తొలగిస్తే తప్పేంటి..? : బీజేపీ

కలం, నిర్మల్‌ : ఓటరు జాబితాలో అక్రమ ఓట్లు, చొరబాటుదారుల ఓట్లు, మరణించిన వారి పేర్లను తొలగించేందుకు చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)ను కాంగ్రెస్‌, ఇండియా కూటమి ఎందుకు వ్యతిరేకిస్తున్నాయని బీజేపీ జాతీయ, రాష్ట్ర అగ్రనేతలు (Telangana BJP) ప్రశ్నించారు. అక్రమ ఓట్ల తొలగింపును కూడా అడ్డుకోవడం వెనుక ఆంతర్యమేమిటని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని నిలదీశారు. ఎన్ని రాజకీయ కుట్రలు చేసినా తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.

ఎస్‌ఐఆర్‌కు మద్దతుగా బీజేఎల్పీ నేత, నిర్మల్‌ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిర్మల్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మహా పాదయాత్రకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి సునీల్‌ బన్సల్‌, రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో నిర్మల్‌కు చేరుకున్న సునీల్‌ బన్సల్‌కు హెలిప్యాడ్‌ వద్ద ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రితేష్‌ రాథోడ్‌ తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలతో కలిసి పాదయాత్రకు బయలుదేరారు. శాంతినగర్‌ చౌరస్తా నుంచి మారెమ్మ ఆలయం, శివాజీ చౌక్‌, చైన్ గేట్ మీదుగా వివేక్‌ చౌక్‌ వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది. వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, ప్రజలు కమలం జెండాలు చేతబట్టి ఉత్సాహంగా పాల్గొన్నారు. దీంతో నిర్మల్‌ పట్టణం కాషాయ జెండాలతో కళకళలాడింది. అనంతరం వివేక్‌ చౌక్‌లో నిర్వహించిన బహిరంగ సభలో బీజేపీ అగ్రనేతలు కాంగ్రెస్‌ వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: సునీల్‌ బన్సల్‌

తెలంగాణలో తదుపరి ప్రభుత్వం బీజేపీదేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్ఛార్జి సునీల్‌ బన్సల్‌ స్పష్టం చేశారు. తనకు బాధ్యతలు అప్పగించిన ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో పార్టీ విజయాలకు కృషి చేసినట్లే తెలంగాణలోనూ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి శ్రమిస్తానని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ఎన్ని కుట్రలు చేసినా ప్రజల మద్దతుతో బీజేపీ విజయాన్ని అడ్డుకోలేరని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటరు జాబితా ప్రక్షాళన అవసరమని, ఎస్‌ఐఆర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ పాదయాత్ర ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

చొరబాటుదారులకు మద్దతిస్తారా: రామచందర్‌ రావు

ఓటరు జాబితాలో మరణించిన వారి పేర్లు, ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఉన్న ఓట్లు, అక్రమంగా నమోదైన ఓట్లను తొలగించేందుకు ఎస్‌ఐఆర్‌ చేపడుతుంటే కాంగ్రెస్‌, ఇండియా కూటమి ఎందుకు వ్యతిరేకిస్తున్నాయని బీజేపీ (Telangana BJP) రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రావు ప్రశ్నించారు. అక్రమ ఓటర్లకు, చొరబాటుదారులకు అండగా నిలుస్తున్నారనే సందేశాన్ని కాంగ్రెస్‌ నేతల వైఖరి ఇస్తోందని విమర్శించారు. తమిళనాడు, తెలంగాణ, కేరళ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ విజయాలు సాధించిన సందర్భాలున్నాయని, ఎస్‌ఐఆర్‌ వల్లే బీజేపీ గెలుస్తుందన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి, రాష్ట్రాన్ని దోచుకున్న సొమ్మును ఢిల్లీకి తరలిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజాచైతన్య యాత్రలు చేపడతామని వెల్లడించారు.

13 కోట్లు కాదు.. 13 ఓట్లు కూడా తొలగించలేదు: బండి సంజయ్‌

దేశంలో 13 కోట్ల ఓట్లు తొలగించారంటూ కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ (Bandi Sanjay) అన్నారు. అర్హులైన ఒక్క ఓటును కూడా తొలగించినట్లు నిరూపిస్తే బీజేపీ సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉందని సవాల్‌ విసిరారు. మరణించినవారి పేర్లు, ఒకే వ్యక్తికి వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఓట్లు, అక్రమంగా నమోదైన ఓట్లను తొలగించడం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమేనన్నారు.

గతంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు 12 సార్లు ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను సమర్థించి, ఇప్పుడు వ్యతిరేకించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఢిల్లీలో రాహుల్‌గాంధీ చుట్టూ తిరుగుతూ తన పదవిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.

రేవంత్‌ రెడ్డి ఢిల్లీకి మూటలు మోస్తున్నారు: ఎమ్మెల్యే ఏలేటి

దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల గుండెచప్పుడని, ప్రపంచ దేశాల్లో భారత్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని బీజేఎల్పీ నేత, నిర్మల్‌ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అన్నారు. ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా రాహుల్‌గాంధీ ఢిల్లీలో చేపట్టిన నిరసన విఫలమైందని, అదే సమయంలో నిర్మల్‌లో బీజేపీ (Telangana BJP) నిర్వహించిన మహా పాదయాత్రకు ప్రజలు భారీగా తరలివచ్చారని పేర్కొన్నారు. ఓటు చోరీ అంటూ కాంగ్రెస్‌ చేస్తున్న ప్రచారం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని విమర్శించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రజల సమస్యలను పక్కనపెట్టి, తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడం కోసమే ఢిల్లీకి మూటలు మోస్తున్నారని ఆరోపించారు. పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్‌, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రజలను మోసం చేశాయని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో సునీల్‌ బన్సల్‌ నేతృత్వంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఆరు గ్యారెంటీలు.. 420 హామీలు ఏమయ్యాయి: ఈటల

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలు ఏమైందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ (Eatala Rajender) ప్రశ్నించారు. రాష్ట్రంలో కేసీఆర్‌ పాలనకు చరమగీతం పాడిన ప్రజలు, రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి కూడా త్వరలోనే బుద్ధి చెబుతారని అన్నారు. కేంద్రంలో మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని, తెలంగాణలోనూ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ఏర్పడితే అభివృద్ధి వేగవంతమవుతుందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పాలనలో జరిగిన అవినీతిపై బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు త్వరలో ప్రజాచైతన్య యాత్రలు నిర్వహిస్తామని తెలిపారు.

కాషాయమయమైన నిర్మల్‌.. నేతల్లో నూతనోత్సాహం

మహా పాదయాత్ర(Maha Padayatra)కు సుమారు 15 నుంచి 20 వేల మంది వరకు హాజరైనట్లు బీజేపీ నేతలు పేర్కొన్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలు, కార్యకర్తలు భారీగా తరలిరావడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఎంపీ జి.నగేష్‌, ఎమ్మెల్యేలు పవార్‌ రామారావు పటేల్‌, పాయల్‌ శంకర్‌, పాల్వాయి హరీశ్‌బాబు, పైడి రాకేశ్‌ రెడ్డి, ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా, ఎమ్మెల్సీలు మల్కా కొమురయ్య, అంజిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు రితేష్‌ రాథోడ్‌ పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు.

Also Read : రోజుల తరబడి ఆందోళన చేస్తారా?: సుప్రీం కోర్టు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>