కలం, మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణంలో ఈ నెల 6వ తేదీన నిర్వహించనున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల (Double Bedroom House) పంపిణీ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని, లబ్ధిదారుల ఎంపికలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి అర్హులైన పేదలకు న్యాయం చేయాలని మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు డిమాండ్ చేశారు. మంగళవారం మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీలోనీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుపేదలకు సొంత ఇల్లు కల్పించాలనే ఉన్నత లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ పథకాన్ని ప్రవేశపెట్టి ఇళ్లను నిర్మించిందని తెలిపారు.
పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయాలనే ఉద్దేశంతో నిర్మించిన ఈ ఇళ్లను కేవలం నిజమైన అర్హులకు మాత్రమే కేటాయించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అయితే ప్రస్తుతం ప్రచురిస్తున్న లబ్ధిదారుల ఎంపికలో పలు అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని, అర్హులైన పేదలను పక్కనపెట్టి అనర్హులకు, ఇదివరకే సొంత ఇళ్లు ఉన్నవారికి ఇళ్లు కేటాయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై అధికారులు తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని కోరారు. లబ్ధిదారుల ఎంపికకు అనుసరించిన నిబంధనలు, అర్హత ప్రమాణాలను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని, ఎంపిక చేసిన పూర్తి జాబితాను బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా అర్హత ప్రాతిపదికన మాత్రమే ఇళ్లను కేటాయించాలన్నారు. పారదర్శకత పాటించాలని కోరుతూ మిర్యాలగూడ బీఆర్ఎస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీవోకి వినతిపత్రం సమర్పించనున్నట్లు వెల్లడించారు. నిరుపేదలకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున నిలబడి పోరాడుతుందని స్పష్టం చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎండి. ఇలియాస్ ఖాన్, ఎండి. మగ్దుం పాషా, బంటు శ్రీనివాస్, పెద్ది శ్రీనివాస్ గౌడ్, సందేషి అంజన్ రాజు, ఎండి. మాజీద్, తిరుమలగిరి వజ్రం, దైద సత్యం, గంగుల బిక్షం యాదవ్, జన్నపాల కిరణ్, దీపిక విజయ్, అరుణ్, ఎండి. అలీం రుక్షాన, బంటు దుర్గయ్య, పందిరి వేణు, వల్లపట్ల వినోద్, ఖలీల్, ఎక్క మనిదీప్, బిక్కన్ తదితరులు పాల్గొన్నారు.

