కలం, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) పట్టణ కేంద్రంలోని అత్యంత విలువైన ప్రధాన మార్కెట్ మున్సిపల్ భూమిని అక్రమ ఆక్రమణదారుల నుంచి వెంటనే రక్షించాలని, నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న అక్రమ నిర్మాణాలను తక్షణమే కూల్చివేయాలని స్థానిక కార్పొరేటర్, మాజీ మేయర్ రవీందర్ సింగ్ (Ravinder Singh) డిమాండ్ చేశారు. మున్సిపల్ ఆస్తుల పరిరక్షణలో పట్టణ ప్రణాళిక (టౌన్ ప్లానింగ్) విభాగం చూపుతున్న నిర్లక్ష్యాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మార్కెట్ స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలను మీడియా ముందు ఉంచారు.
2 ఎకరాల 18 గుంటల భూమి మున్సిపాలిటీదే..
ప్రధాన మార్కెట్ ప్రాంతంలో ఉన్న మొత్తం 2 ఎకరాల 18 గుంటల భూమి (ఇందులో 1 ఎకరం 20 గుంటల మాంసం మార్కెట్, 20 గుంటల కూరగాయల మార్కెట్, 18 గుంటల నీటి రిజర్వాయర్ ఉన్నాయి) సంపూర్ణంగా మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందినదేనని కార్పొరేటర్ స్పష్టం చేశారు. 1967 వరకు ఇక్కడ జ్యుడీషియల్ కోర్టు ఉండేదని, ఆ తర్వాత మున్సిపాలిటీ చట్టబద్ధంగా ప్రభుత్వానికి సొమ్ము చెల్లించి ఈ స్థలాన్ని కొనుగోలు చేసి తన ఆధీనంలో ఉంచుకుందని గుర్తుచేశారు.
సుప్రీంకోర్టు వరకు పోరాడి గెలిచాం..
మసీదు స్థలానికి సంబంధించి గతంలో వక్ఫ్ ట్రిబ్యునల్ నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు న్యాయపోరాటం జరిగిందని తెలిపారు. 2011 సెప్టెంబర్ 30న సుప్రీంకోర్టు కూడా మున్సిపాలిటీకి అనుకూలంగా తీర్పునిచ్చిందని వెల్లడించారు. అయితే, కోర్టు తీర్పులకు విరుద్ధంగా 2011 సెప్టెంబర్ 13న గెజిట్ సవరణ చేయడం జరిగిందని, దీనిని సవాలు చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ (WP నెం. 39802/2016) ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉందని వివరించారు.
న్యాయస్థానంలో తుది తీర్పు వెలువడక ముందే మార్కెట్ స్థలంలో ఆక్రమణలకు పాల్పడటం అత్యంత అన్యాయమన్నారు. మార్కెట్ ప్రాంతంలో మస్జిద్-ఎ-అదాలత్ నిర్వాహకులు ఆక్రమణలకు పాల్పడుతూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా.. టౌన్ ప్లానింగ్ అధికారులు ఫిర్యాదులు స్వీకరించినప్పటికీ పట్టించుకోకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ఆస్తులను కాపాడాల్సిన అధికారుల నిర్లక్ష్యం వెనుక ఉన్న ఒత్తిళ్లు ఏమిటని ప్రశ్నించారు. బాధ్యులైన అధికారులపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
మున్సిపల్ భూమిని తక్షణమే పూర్తిస్థాయిలో సర్వే చేసి సరిహద్దులు నిర్ధారించాలని పేర్కొన్నారు. మార్కెట్ స్థలంలో అనుమతులు లేకుండా చేపట్టిన అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని అన్నారు. ఫిర్యాదులు అందించినా స్పందించని టౌన్ ప్లానింగ్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూకబ్జాదారుల నుంచి మున్సిపల్ ఆస్తిని కాపాడేందుకు ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు.
అన్ని పార్టీలు కలిసి రావాలి
”ఇది నా వ్యక్తిగత స్వార్థం కోసం చేస్తున్న పోరాటం కాదు. కరీంనగర్ ప్రజల ఆస్తిని కాపాడేందుకు బీఆర్ఎస్ నాయకుడిగా కాకుండా నా డివిజన్ కార్పొరేటర్‌గా అన్ని పార్టీలను, ప్రజా సంఘాలను ఆహ్వానిస్తున్నాను. స్థానిక పాలకవర్గానికి, మేయర్‌కు, లేదా ఎంపీకి ఇందులో సంబంధం లేకపోతే వెంటనే స్పందించి ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల ప్రజాక్షేత్రంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం” అని హెచ్చరించారు.

