కలం, వెబ్ డెస్క్ : జీహెచ్ఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్ (GHMC Assistant Director) యాదగిరి రావు నివాసాల్లో ఏసీబీ (ACB) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ దర్యాప్తు సాగుతోంది. హైదరాబాద్ ఉప్పల్‌లోని హైకోర్టు కాలనీలో ఉన్న ఆయన నివాసంతో పాటు సూర్యాపేటలోని ఇల్లు, మరికొన్ని ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.
ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ ఆధ్వర్యంలో పలు బృందాలు తెల్లవారుజాము నుంచే రంగంలోకి దిగాయి. యాదగిరి రావుకు సంబంధించిన స్థిర, చరాస్తులతో పాటు ఆర్థిక లావాదేవీలపై అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఆయన ఆదాయ వనరులు, ప్రస్తుతం కలిగి ఉన్న ఆస్తుల విలువను సేకరించి పరిశీలిస్తున్నారు.

