కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లా జక్రాన్ పల్లి మండలం కలిగోట్‌లో నూతనంగా నెలకొల్పుతున్న జవహర్ నవోదయ విద్యాలయ కొత్త క్యాంపస్ భవన నిర్మాణ ప్రదేశాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) మంగళవారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. జేవీఎన్ నిర్వహణకు అనువైన పరిస్థితులు, అందుబాటులో ఉన్న వసతులను నిశితంగా పరిశీలించారు. ఇప్పటివరకు చేపట్టిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
పనులను నాణ్యతతో వేగంగా జరిపించాలని, విద్యార్థులకు అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పనులు చేపట్టే సందర్భంగా ఏవైనా ఆటంకాలు ఎదురవుతున్నాయా అని ఆరా తీశారు. అటవీ శాఖతో పాటు ఇతర అన్ని రకాల అనుమతులు తీసుకున్నామని, ఎలాంటి సమస్యలు లేవని సంబంధిత అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల ప్రయోజనార్ధం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ విద్యా సంస్థను ఏర్పాటు చేస్తోందని, దీనిని దృష్టిలో పెట్టుకుని నిర్దేశిత గడువు లోపు పనులు పూర్తయ్యేలా చొరవ చూపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
తరగతి గదులు, డార్మెటరీ, డైనింగ్ హాల్, లైబ్రరీ, బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ భవనాలు, స్టాఫ్ క్వార్ట్రర్స్ కోసం నిర్మించనున్న భవన సదుపాయాల బ్లూప్రింట్‌ను పరిశీలించారు. విద్యార్థులతో పాటు అధ్యాపకులు, సిబ్బందికి తగిన వసతి, బోధనా తరగతుల నిర్వహణ వంటి వాటికి ఇబ్బందులు లేకుండా అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు.

