కలం, వెబ్ డెస్క్ : చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ (Kuppam Municipal) కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఓట్ల లెక్కింపు సమయంలో పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. మున్సిపాలిటీలోని 3, 7, 8 వార్డుల్లో తమ పార్టీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ, తమను, తమ ఏజెంట్లను అధికారులు బలవంతంగా కేంద్రం నుంచి బయటకు పంపించారని వైసీపీ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.
ఈ పరిణామాలపై వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై మండిపడ్డారు. కౌంటింగ్‌లో తాను విజయం సాధించినప్పటికీ, అధికారికంగా గెలుపును ప్రకటించకుండానే తనను బయటకు పంపించారని ఆయన ఆరోపించారు. కుప్పం మున్సిపల్ కమిషనర్ నిష్పాక్షికంగా వ్యవహరించకుండా తెలుగుదేశం పార్టీ ఏజెంట్‌లా పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. టీడీపీ అభ్యర్థులను అక్రమంగా గెలిపించేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వైసీపీ అభ్యర్థులు, ఏజెంట్లు అసహనం వ్యక్తం చేస్తూ కౌంటింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు.

