కలం, వరంగల్ బ్యూరో: వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు (Warangal Graduate MLC Elections) ఇప్పటికే రాజకీయ పార్టీల్లో వేడి పెంచాయి. అధికార కాంగ్రెస్ ముందుగానే అభ్యర్థిని ప్రకటించి ఎన్నికల వ్యూహానికి పదును పెడుతోంది. ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం అభ్యర్థి ఎంపికకై మల్లగుల్లాలు పడుతోంది. గతంలో పోటీ చేసి ఓడిన ఏనుగుల రాకేశ్‌రెడ్డికి మరో చాన్స్ ఇవ్వాలా? లేక బీసీ ఓటర్లను దృష్టిలో పెట్టుకుని ఆ వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దించాలా? అనే అంశంపై గులాబీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గతంలో పార్టీని వీడి బీఆర్ఎస్లోకి వెళ్లిన రాకేశ్‌రెడ్డిని తిరిగి తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపిక మరింత ఆసక్తికరంగా మారింది.
మరోసారి చాన్స్ ఇవ్వాలని..
గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి రాకేశ్‌రెడ్డి పోటీ చేయగా.. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి కూడా ఆయనకే అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ యువజన విభాగానికి చెందిన కొందరు నేతలు పట్టుబడుతున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో ఎదురైన అనుభవంతో ఈసారి మరింత పకడ్బందీగా ప్రచారం నిర్వహించి విజయం సాధించవచ్చనే ధీమాను వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.
బీసీ నేతను పోటీలోకి దించాలనే..
వరంగల్ ప్రాంతంలో బీసీ ఓటర్ల సంఖ్య భారీగానే ఉండటంతో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యమివ్వాలనే వాదన బీఆర్ఎస్లో బలంగా వినిపిస్తోంది. పార్టీకి చెందిన సుందర్రాజ్ పేరును తెరపైకి కొందరు నేతలు తెస్తున్నారు. మాస్టర్ డిగ్రీ కాలేజీ అధినేతగా గుర్తింపు ఉన్న ఆయన బీఆర్ఎస్ హయాంలో కుడా చైర్మన్ గా కూడా పనిచేశారు. ఆయనను బరిలోకి దించడం ద్వారా బీసీ ఓటర్ల మద్దతు కూడగట్టవచ్చని నేతలు చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది.
రాకేశ్‌రెడ్డి అనుభవానికి ప్రాధాన్యమిస్తారా? లేక బీసీ సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటారా? అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. గతంలో ముందుగానే అభ్యర్థిని ప్రకటించి ప్రచారానికి సమయం కేటాయించడం ఆ పార్టీ వ్యూహంగా ఉండేది. ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు బీజేపీ నుంచి రాకేశ్‌రెడ్డికి ఆహ్వానం ఉందనే ప్రచారం బీఆర్ఎస్ అధిష్టానానికి కొత్త తలనొప్పిగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రచారంలో కాంగ్రెస్ దూసుకెళ్తూ..
ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Graduate MLC Elections) నిరుద్యోగులు, ఉద్యోగులు, యువత సమస్యలతో పాటు సామాజిక సమీకరణాలు కూడా కీలకంగా మారనున్నాయి. గత ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థికే మరో అవకాశం ఇవ్వాలా? బీసీ అభ్యర్థితో కొత్త సమీకరణాలకు తెరతీయాలా? లేక పార్టీ మార్పుల ప్రచారం నేపథ్యంలో ప్రత్యామ్నాయ అభ్యర్థిని పరిశీలించాలా? అనేది బీఆర్ఎస్ అధిష్టానం ముందున్న సవాలుగా మారింది. అన్ని పార్టీల కంటే ముందస్తుగానే కాంగ్రెస్ తమ అభ్యర్థిగా రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తోంది. బీజేపీ ఇంకా అభ్యర్థి ఎంపికపైనే దృష్టి సారించడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. చివరకు రాకేశ్‌రెడ్డి ఎటువైపు అడుగులు వేస్తారు? బీఆర్ఎస్ పగ్గాలు ఎవరికి అప్పగిస్తుంది? అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.
బీజేపీలోకి తీసుకొచ్చేందుకు..
గతంలో తమ పార్టీలోంచి బీఆర్ఎస్లో చేరిన రాకేశ్‌రెడ్డిని తిరిగి తీసుకొచ్చేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్రావును కూడా రాకేశ్‌రెడ్డి కలిసినట్లు సమాచారం. ఆయనను తమ అభ్యర్థిగా బరిలోకి దించాలనే ఆలోచనతో బీజేపీ నాయకత్వం ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. మరోవైపు బీజేపీ కూడా అభ్యర్థి ఎంపికపై కూడా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రాకేశ్‌రెడ్డి బీజేపీలోకి వస్తే బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపిక సమీకరణాలు మారే చాన్స్ ఉంది. రెండు పార్టీల కంటే ముందుగానే కాంగ్రెస్ తమ అభ్యర్థిని ప్రకటించింది. మూడు ఉమ్మడి జిల్లాల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రచారంలో దూసుకెళ్తోంది.

