కలం, కరీంనగర్ బ్యూరో: డిగ్రీ కాలేజీ విద్యార్థుల ఆలోచనలు క్లాస్‌రూమ్‌లు, అసైన్‌మెంట్లు, పరీక్షలు, గ్రేడ్లకే పరిమితమవుతాయి. చదువు పూర్తయ్యాక ఏదో ఒక జాబ్ లో చేరడమే ధ్యేయంగా సాగుతారు. కానీ.. కరీంనగర్‌కు చెందిన ఆ ఐదుగురు విద్యార్థినులు మాత్రం వినూత్నంగా ఆలోచించారు. పుస్తకాలకే పరిమితం కాకుండా సమాజంలోని ఒక ప్రధాన సమస్యను గుర్తించారు. దాన్నే తమ వ్యాపార అవకాశంగా మలుచుకున్నారు. స్టార్టప్ పారిశ్రామికవేత్తలుగా అవతరించారు. బీబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అక్షయ, రవళి, సాన్వితతో పాటు సెకండ్ ఇయర్ చదివే వైష్ణవి, ఆనందిత కలిసి ‘Vegmart.com’ స్టార్టప్ (Vegmart startup)ను ప్రారంభించారు. ఇప్పుడిది కరీంనగర్‌లో చర్చనీయాంశమైంది.
ఆర్గానిక్‌తో సమస్యకు చెక్
ప్రస్తుత బిజీ లైఫ్ లో స్వచ్ఛమైన ఆహారం దొరకడం సవాలుగా మారింది. మార్కెట్లో దొరికే కూరగాయల్లో క్రిమిసంహారకాల ప్రభావం పెరుగుతుందనే ఆందోళన ప్రతి ఇంట్లోనూ ఉంది. ఇలాంటి సమస్యను గుర్తించిన విద్యార్థినులు నేరుగా ఆర్గానిక్ రైతులతో అనుసంధానమై, ఎలాంటి రసాయనాలు లేని కూరగాయలను వినియోగదారుల ఇళ్లకు అందించేందుకు Vegmart.com వేదికకు శ్రీకారం చుట్టారు. కేవలం ఆర్గానిక్ కూరగాయల డెలివరీకే పరిమితం కాలేదు. నేటితరం జీవనశైలిని లోతుగా స్టడీ చేశారు.
చదువు అయిపోయాక ..
మేనేజ్‌మెంట్ కోర్సు చదివి మార్కెటింగ్, ఫైనాన్స్, మార్కెట్ రీసెర్చ్, సప్లై చైన్ మేనేజ్‌మెంట్ లాంటి సిద్ధాంతాలను పుస్తకాలకే పరిమితం చేయకుండా, కాలేజీ రోజుల్లోనే నిజజీవితంలో అమలు చేసి చూపించడం విద్యార్థినుల ప్రత్యేకతగా నిలుస్తోంది. “ చదువు అయిపోయాక, ఏ కంపెనీలోనో జాబ్ కోసం బయోడేటాతో క్యూలో ఉండడం మాకు ఇష్టం లేదు. మేమే పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి.
ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని, సమయాన్ని ఆదా చేసే సేవలను అందించడమే మా Vegmart.com లక్ష్యం.” అని సదరు విద్యార్థినులు చెప్పారు. తమకు అల్ఫోర్స్ డిగ్రీ ఉమెన్ కాలేజీ మేనేజ్ మెంట్ కూడా సహకరిస్తుందని తెలిపారు. ఐదుగురు విద్యార్థినులు స్ఫూర్తిగా నిలుస్తూ.. స్వయం సమృద్ధి సాధించాలనే సంకల్పం ఉంటే సాధించలేనిదేమీ లేదని నిరూపిస్తున్నారు. చదువుతో పాటు వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
రెడీ టు కుక్..
విద్యార్థినులు తమ బిజినెస్ మోడల్ లో ‘రెడీ-టు-కుక్’ జోడించారు. కూరగాయలను సేకరించిన వెంటనే శాస్త్రీయ పద్ధతిలో శుభ్రం చేస్తారు. వినియోగదారుల అవసరాలకు తగినట్లుగా పరిశుభ్రమైన వాతావ రణంలో కట్ చేసి ప్యాక్ చేస్తారు. నేరుగా ఇంటికే డెలివరీ చేయడం ద్వారా వంట సమయం సగానికి పైగా ఆదా అవుతుం ది. ఇది ఉదయాన్నే ఆఫీసులకు పరిగెత్తే ఉద్యోగులకు, స్వయంగా వంట చేసుకోవడానికి ఇబ్బందిపడే బ్యాచిలర్స్‌కు పెద్ద ఊరట కలిగించనుంది.
స్టార్ట్ ప్ గా ప్రారంభించాం.. విస్తరిస్తాం : విద్యార్థినులు అక్షయ, రవళి, సాన్విత, వైష్ణవి, ఆన
మేము ఈరోజు గ్రామ భారతి.. శాతవాహన గ్రామీణ భారతి సంత కరీంనగర్లో పాల్గొన్నాం. ఓ వైపు చదువుకుంటూనే.. ఇటీవలే స్టార్టప్ ప్రారంభించాం. కాలేజీ సార్ల నుంచి సపోర్టు ఉంది. ఇది మా ఆలోచనే. మా ముగ్గురితో పాటు ఇద్దరు సీనియర్లు సైతం ఉన్నారు. ఈ స్టార్టప్ బిజినెస్ ను మరింత విస్తరించేందుకు ప్రణాళికతో ముందుకెళ్తాం.
Also Read : వరంగల్ ఎమ్మెల్సీ టికెట్ పై బీఆర్ఎస్, బీజేపీలో సస్పెన్స్!
Follow Us On : WhatsApp

