కలం, కరీంనగర్ : బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుఫాన్ (Murasu Cyclone) నేపథ్యంలో రైతులు పంట నష్టపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ (MLA Kavvampalli) సూచించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం వరి కోతలు, ధాన్యం నూర్పిళ్లు కొనసాగుతున్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కోసిన వరి పంటను పొలాల్లోనే వదిలేయకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా టార్పాలిన్లు, కవర్లను సిద్ధంగా ఉంచుకోవాలని, కల్లాలు, రహదారుల పక్కన ఆరబెట్టిన ధాన్యాన్ని వర్షం నుంచి కాపాడేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు.
ధాన్యం నిల్వ కేంద్రాలు, కొనుగోలు కేంద్రాల వద్ద ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి గ్రామంలో వాతావరణ పరిస్థితులపై రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉంటూ రైతులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, పీఏసీఎస్ పాలకవర్గాలు సమన్వయంతో పనిచేసి రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు. సర్పంచులు, ఉప సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సైతం రైతులకు అండగా నిలిచి, ధాన్యం తడవకుండా రక్షణ చర్యలు చేపట్టడంలో సహకరించాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి విజ్ఞప్తి చేశారు.
Also Read : పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు బిగ్ అలర్ట్
Follow Us On : WhatsApp

