కలం, జోగులాంబ గద్వాల: జాతీయ రహదారిపై ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఇటిక్యాల మండల పరిధిలోని ధర్మవరం స్టేజ్ (Dharmavaram Stage) సమీపంలో చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లా పులకుంట గ్రామానికి చెందిన మల్లికార్జున్ (40), డ్రైవర్ బాలాజీతో కలసి హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ధర్మవరం స్టేజ్ వద్దకు చేరుకోగానే జాతీయ రహదారిపై ఆగి ఉన్న డీసీఎంను కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందరి భాగం తీవ్రంగా నుజ్జునుజ్జయ్యి, మల్లికార్జున్ (38) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు నడుపుతున్న డ్రైవర్ బాలాజీకి స్వల్ప గాయాలయ్యాయి.
గమనించిన స్థానికులు, పోలీసులు గాయపడిన డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కోదండపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. అయితే డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

