కలం, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తాగునీటి సంరక్షణ, శుద్ధి చేసిన మురుగునీటి పునర్వినియోగాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ సచివాలయం వేదికగా జలమండలి గ్రీన్ వాటర్ ట్యాంకర్ల (Green Water Tankers) సేవలను ప్రారంభించింది. జలమండలి 37వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిర్మాణ పనులు, ల్యాండ్‌స్కేపింగ్, గార్డెనింగ్, పార్కుల నిర్వహణ వంటి తాగేతర అవసరాల కోసం ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని వినియోగించేలా ఈ చర్యలు చేపట్టారు.
తొలివిడతలో భాగంగా 19 ఎస్టీపీల నుంచి 28 గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా అత్తాపూర్, అంబర్పేట్, నాగోల్, కోకాపేట్, గోపన్‌పల్లి, మియాపూర్ తదితర ప్రాంతాల్లో ఈ నీటిని సరఫరా చేయనున్నారు. అనంతరం దశలవారీగా ఈ సేవలను నగరవ్యాప్తంగా విస్తరించనున్నారు. ఈ పథకం కింద సరఫరా కోసం జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ప్రైవేటు సంస్థలకు చెందిన సుమారు 100 ట్యాంకర్లు నమోదు చేసుకున్నాయి.
వీటికి ప్రత్యేక బ్రాండింగ్, జీపీఎస్ ట్రాకింగ్, ఈ-పీఓఎస్, బుకింగ్ వ్యవస్థలను అనుసంధానించారు. ఈ నీరు తాగడానికి పనికిరాదనే స్పష్టమైన హెచ్చరికలను కూడా ట్యాంకర్లపై ప్రదర్శిస్తారు. రాబోయే ఎల్‌నినో పరిస్థితులను అధిగమించేందుకు, భూగర్భ జలాల పై ఒత్తిడి తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ శుద్ధి చేసిన నీటిని వినియోగించాలని జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి కోరారు.

