కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులు (Nirmal NHM Employees) చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం 20వ రోజుకు చేరుకుంది. మహిళా ఉద్యోగులు తమ చేతులపై మెహందీతో డిమాండ్లు రాసుకొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్‌హెచ్‌ఎం పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. సర్వీసుల క్రమబద్ధీకరణ పూర్తయ్యే వరకు 100 శాతం గ్రాస్ శాలరీ చెల్లించాలని కోరారు. ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించడంతోపాటు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మెను విరమించేది లేదని, పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

