కలం, స్పోర్ట్స్ : ఆధునిక హాకీ (Modern Hockey) లో వేగమే పరమావధిగా మారిపోయింది. డేటా విశ్లేషణలు, కోచ్‌ల కఠినమైన వ్యూహాల పుణ్యమా అని ఆట స్వరూపమే పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఆటగాళ్ల స్వతంత్ర ప్రతిభతో కళాత్మకంగా సాగిన హాకీ, ఇప్పుడు కేవలం ఒక రోబోటిక్ పరుగుల పోటీలా తయారైందని క్రీడా నిపుణులు మండిపడుతున్నారు. అంతర్జాతీయ హాకీ సమైక్య (ఎఫ్ఐహెచ్) క్వార్టర్స్ విధానాన్ని తెచ్చిన తర్వాత ఆటలో వేగం విపరీతంగా పెరిగింది. జిపిఎస్ ట్రాకింగ్, హృదయ స్పందనల విశ్లేషణ, మైక్రో సెకన్ల వీడియో రిఫరల్స్‌తో ఆటతీరు పూర్తిగా యాంత్రికమైపోయింది.
దీనిపై భారత మాజీ కెప్టెన్ వి. భాస్కరన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఆట పూర్తిగా కోచ్‌లు, అనలిస్ట్‌ల చేతుల్లోకి వెళ్ళిపోయిందని, ఆటగాళ్ల సొంత ఆలోచనలకు తావు లేకుండా పోయిందని తేల్చిచెప్పారు. మరోవైపు మాజీ ఆటగాడు అర్జున్ హాలప్ప స్పందిస్తూ.. నిబంధనలను పదే పదే మార్చడం వల్ల ప్రేక్షకులు గందరగోళానికి గురవుతున్నారని విమర్శించారు. ఆటలో వేగం అవసరమే అయినప్పటికీ, నిబంధనలను సరళీకరించి ఆటగాళ్ల వ్యక్తిగత నైపుణ్యాలకు కూడా పూర్తి స్వేచ్ఛనివ్వాలని నిపుణులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

