కలం, హనుమకొండ : వైఎస్ఆర్ నగర్ గుడిసెవాసులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని మాజీ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్ (Dasyam Vinay Bhaskar) ప్రకటించారు. ఆదివారం కాజీపేట చౌరస్తాలో(Kazipet Crossroads) మీడియాతో మాట్లాడుతూ.. మూడు, నాలుగు దశాబ్దాలుగా పేదలు అక్కడ నివసిస్తున్నారని, వారికి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. 2014 ఎన్నికల సమయంలో గుడిసెవాసులకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన నాయకులు ఇప్పుడు మాట మారుస్తున్నారని విమర్శించారు.
కాజీపేట చౌరస్తాలోని కాంప్లెక్స్‌కు 15 ఏళ్లుగా రాని అనుమతులు నాయిని రాజేందర్‌రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తనపై వ్యక్తిగత విమర్శలు కాకుండా పేదల సమస్యపై మాట్లాడాలని సూచించారు. సోమవారం వైఎస్ఆర్ నగర్ నుంచి కాజీపేట ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, ప్రజా సంఘాలతో కలిసి గుడిసెవాసుల తరఫున పోరాడతామని తెలిపారు. కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి మాట్లాడుతూ.. పేదల స్థలాల జోలికి రావద్దని, గుడిసెవాసులకు స్థలాలు కేటాయించి పక్కా ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

