కలం, వెబ్ డెస్క్ : ఎన్నికల సంఘం తన స్వతంత్రతను కోల్పోయి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) విమర్శించారు. న్యూఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఇండియా కూటమి నిర్వహించిన ‘చలో ఢిల్లీ – ఓట్ బచావో, దేశ్ బచావో’ మహా ర్యాలీలో ఆయన మాట్లాడారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో దేశంలో అర్హులైన పౌరుల ఓటు హక్కును తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ మిగతా కమిషనర్ల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని పేర్కొన్నారు.
గత ఐదారేళ్లుగా రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితాలో జరుగుతున్న అక్రమాలపై దేశ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని భట్టి విక్రమార్క తెలిపారు. ప్రారంభంలో ఈ హెచ్చరికలను రాజకీయ విమర్శలుగా చూసినప్పటికీ, ఇప్పుడు ఎన్నికల సంఘం అంతర్గత సభ్యుల నుంచే అభ్యంతరాలు వ్యక్తమవుతుండటం గమనార్హమని అన్నారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన సమాన ఓటు హక్కును హరించడం అంటే ప్రజాస్వామ్య పునాదులకే ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ఎన్నికల సంఘం ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా స్వతంత్ర నిర్ణయాలతో పనిచేయాలని డిమాండ్ చేశారు.

