కలం, తెలంగాణ బ్యూరో: చిరుధాన్యాలతో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడంతో పాటు మహిళా సంఘాలకు కొత్త ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మిల్లెట్ కేఫ్‌లను ఏర్పాటు చేస్తున్నది. సెర్ప్ ఆధ్వర్యంలో వీటి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఒకప్పుడు మన ఆహారంలో ప్రధానమైన జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు వంటి చిరుధాన్యాలను ప్రస్తుత తరానికి అందుబాటులోకి తీసుకురానున్నది.
తొలి విడతలో రూ.2.2 కోట్ల పెట్టుబడితో ఐదు ప్రాంతాల్లో మిల్లెట్ కేఫ్ (Millet Cafes)లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. ఇందుకోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (ఐఐఎంఆర్), ఏపీపీసీ సంస్థలతో సెర్ప్ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇప్పటికే ఐఐఎంఆర్ 40 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ ఇచ్చింది.
ఎక్కడెక్కడంటే?
తొలి విడతలో హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్, ఇందిరా మహిళా శక్తి బజార్, ఎంసీఆర్హెచ్ఆర్డీ క్యాంపస్‌తో పాటు యాదగిరిగుట్ట, మహబూబ్‌నగర్ పట్టణాల్లో మిల్లెట్ కేఫ్‌లను ఏర్పాటు చేయాలని సెర్ప్ ప్రణాళిక రూపొందించింది. బీఆర్కే భవన్, ఇందిరా మహిళా శక్తి బజార్, ఎంసీఆర్హెచ్ఆర్డీ క్యాంపస్, యాదగిరిగుట్ట ప్రాంతాల్లో నిర్మాణ పనులు ముగింపు దశకు వచ్చాయి. ఈ కేఫ్‌లను త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక మహబూబ్‌నగర్‌లో కేఫ్ ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నది.
ఏయే పదార్థాలు?
ఈ కేఫ్‌ల ద్వారా చిరుధాన్యాల ఉత్పత్తులకు మార్కెట్ కల్పించడంతో పాటు మహిళా సంఘాలకు ఆదాయ మార్గాలను చూపినట్టు అవుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. స్థానికంగా చిరుధాన్యాల ఆధారిత ఆహార ఉత్పత్తుల తయారీ, విక్రయాలను ప్రోత్సహించడం ద్వారా వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొంటున్నది. ఈ కేఫ్‌లలో మిల్లెట్ కేక్స్, మిల్లెట్ బిస్కెట్లు, చిరుధాన్యలతో తయారు చేసిన రొట్టెలు, మురుకులు, పులిహోర, రాగి సంకటి, రాగి జావ, మిల్లెట్ ఉప్మా, మిల్లెట్ కిచిడీ వంటి వంటకాలు లభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆరోగ్యం.. ఆదాయం : మంత్రి సీతక్క
చిరుధాన్యాలు మన పూర్వీకుల ఆహార సంస్కృతిలో భాగం. వాటిలోని పోషక విలువలను నేటి తరానికి చేరువ చేయాలి. మిల్లెట్ కేఫ్‌ల ద్వారా ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంతో పాటు మహిళా సంఘాలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగి, తమ కాళ్లపై తాము నిలబడటమే మా లక్ష్యం. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలు, గ్రామాలు, రాష్ట్రం అభివృద్ధి చెందుతాయి.

