కలం, కరీంనగర్ బ్యూరో: బిందె పట్టుకుని రోడ్డెక్కిన మహిళ.. నీటి ట్యాంకర్ రాక కోసం కళ్లల్లో ఒత్తులేసుకుని గంటల తరబడి ఎదురుచూస్తున్న కాలనీవాసులు.. స్మార్ట్ సిటీగా వెలిగిపోతున్న కరీంనగర్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే దీనమైన దృశ్యాలు. భానుడి భగభగలు తీవ్ర స్థాయికి చేరకముందే.. వేసవి ముందస్తు పలకరింపులోనే నగరంలో తాగునీటి ముప్పు (Drinking Water Crisis) ముంచుకొచ్చింది. నగరానికి అత్యంత సమీపంలోనే మానేరు జలాశయం ఉన్నప్పటికీ, తలాపునే నీళ్లు పెట్టుకుని దాహంతో అల్లాడాల్సిన దుస్థితి ఏర్పడింది. అసలు ఈ జల సంక్షోభానికి కారణమేంటి? కేవలం ‘ఎల్ నినో’ రూపంలో విరుచుకుపడ్డ ప్రకృతి కోపమేనా.. లేక ముందస్తు పర్యవేక్షణ, ప్రణాళిక లోపమా? అనే ప్రశ్నలు ఇప్పుడు నగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఎల్ నినో దెబ్బ..పాతాళానికి పడిపోయిన భూగర్భ జలాలు
వాతావరణంలో సంభవించిన అంతర్జాతీయ మార్పులు, ‘ఎల్ నినో’ ప్రభావం కరీంనగర్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గత ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో మానేరు జలాశయంతో పాటు స్థానిక నీటి వనరులు అడుగంటాయి. భూగర్భ జలమట్టాలు దారుణంగా పడిపోవడంతో నగర వ్యాప్తంగా వేలాది బోర్లు వట్టిపోయాయి. భానుడి ప్రతాపానికి బావులు, చేతిపంపులు పనిచేయక ప్రజలకు సహజ సిద్ధంగా లభించే నీటి సరఫరా పూర్తిగా స్తంభించింది.
ట్యాంకర్ల చుట్టూనే సగటు బతుకులు
ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో కాలనీవాసులు చుక్క నీటి కోసం నిత్య పోరాటం చేయాల్సి వస్తోంది. రోజువారీ పనులు, ఉద్యోగాలు, పిల్లల చదువులను పక్కనపెట్టి ఉదయాన్నే ట్యాంకర్ల కోసం వేచి చూడాల్సిన దౌర్భాగ్యం పట్టుకుంది. మున్సిపల్ ట్యాంకర్లు సరిపోక సామాన్యులు ప్రైవేట్ నీటి వ్యాపారులను ఆశ్రయించి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. ప్రైవేట్ ట్యాంకర్ల నిర్వాహకులు ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని రూ. 800 నుండి రూ. 1500 వరకు వసూలు చేస్తున్నారు. సామాన్య, మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ తలకిందులవుతోంది. ప్రధాన నగరంలోని కొన్ని ప్రాంతాలకు అరకొరగా నీరు అందుతున్నా విలీన గ్రామాలు, శివారు కాలనీలలో చుక్క నీరు లేక ప్రజలు కిలోమీటర్ల కొద్దీ వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. ద్విచక్ర వాహనాలపై, సైకిళ్లపై బిందెలు, డ్రమ్ములతో నీటిని మోసుకెళ్తున్న దృశ్యాలు స్మార్ట్ సిటీ ప్రతిష్టను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
తలాపునే మానేరు.. దొరకని తాగ్రునీరు..
తలాపునే మానేరు డ్యాం ఉన్నా నగర ప్రజలకు త్రాగునీటి కష్టాలు తప్పడం లేదు. ప్రధాన నీటి పైప్లైన్లు సరిగ్గా లేకపోవడం వల్ల వేలాది లీటర్ల నీరు డ్రైనేజీల పాలవుతోంది. డివిజన్లలో సమన్వయం లేకపోవడం, కొన్ని ప్రాంతాలకు గంటల తరబడి, మరికొన్ని ప్రాంతాలకు నిమిషాల వ్యవధిలోనే సరఫరా నిలిపివేయడం పట్ల ప్రజల ఆగ్రహం వ్యక్తమవుతోంది. మితిమీరిన బోర్ల తవ్వకం వల్ల భూగర్భ జలాలు ఇంకిపోయాయి. కానీ పునరుద్ధరణ చర్యలు లేవనే విమర్శలున్నాయి.
‘మిషన్ భగీరథ’ లక్ష్యం నెరవేరిందా?
కోట్ల రూపాయలు వెచ్చించిన ‘మిషన్ భగీరథ’ మరియు ’24/7 నీటి సరఫరా’ పథకం క్షేత్రస్థాయిలో ఎందుకు పడకేసిందనేది పెద్ద ప్రశ్నగా మారింది. అనేక కాలనీల్లో పైప్లైన్లు వేసినా కనెక్షన్లు సరిగ్గా ఇవ్వకపోవడంతో నీరు ట్యాంకులకే పరిమితమవుతోంది. ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు తగ్గుతాయని ముందే హెచ్చరికలు ఉన్నప్పటికీ, అధికారులు ఎల్లంపల్లి ఇతర వనరుల నుండి నీటి తరలింపుపై ముందస్తు కసరత్తు చేయకపోవడం అధికారుల అలసత్వానికి నిదర్శనం.
ముందుంది అసలు ముప్పు
మార్చిలోనే పరిస్థితి ఈ స్థాయిలో ఉంటే.. రాబోయే తీవ్ర వేసవి కాలమైన మే, జూన్ నెలల్లో నగరం ఎలా మనుగడ సాగిస్తుందనేది ఆందోళన కలిగిస్తోంది. ఎల్ నినో ప్రభావం వల్ల రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రత్యామ్నాయ నీటి నిల్వలు పెంచుకోకపోతే కరీంనగర్ తీవ్రమైన ‘డ్రై స్పెల్’ (ఎడారి తరహా పరిస్థితి)ను ఎదుర్కొనే ప్రమాదం ఉంది.
ముందస్తు ప్రణాళికలే ముఖ్యం…
నీటి ఎద్దడి ప్రకృతి సృష్టించిన సమస్యే కావచ్చు.. కానీ దాన్ని అధిగమించే సమాధానం పకడ్బందీ మానవ ప్రణాళికలోనే ఉందంటున్నారు నిపుణులు. నగర ప్రజల నీటి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ నంబర్‌తో కూడిన కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాలి. ట్యాంకర్ల నీటిని వాణిజ్య అవసరాలకు మళ్లిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎల్లంపల్లి ప్రాజెక్టు లేదా లోయర్ మానేర్ డ్యామ్ నుంచి అత్యవసరంగా నీటిని తరలించేందుకు యంత్రాంగం ఇప్పుడే పక్కా ప్రణాళికను అమలు చేయాలి. ట్యాంకర్ల సరఫరాలో రాజకీయ జోక్యాన్ని పూర్తిగా అరికట్టాలి. ఎత్తైన ప్రాంతాలు, మురికివాడలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. భవిష్యత్ తరాల మనుగడ కోసం వర్షపు నీటిని భూమిలోకి ఇంకించే గుంతలను ప్రతి ఇంట్లో తప్పనిసరి చేయాలి.
సమిష్టి బాధ్యతతోనే పరిష్కారం
తాగునీటి కష్టాలు తీర్చడం కేవలం పాలకులు, అధికారుల బాధ్యత మాత్రమే కాదు.. లభించే ప్రతి చుక్కనూ వృథా చేయకుండా చూడటం ప్రతి పౌరుడి ప్రాథమిక కర్తవ్యం. జిల్లా అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోతే కరీంనగర్ సుదీర్ఘ నీటి సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయం!

